షార్ట్‌లో వచ్చిన బాధితులకు పోలీస్ స్టేషన్‌లోకి నో ఎంట్రీ.. లేడీ పోలీసులు ఉన్నారంటూ..

కోల్‌కతా పోలీసులు ఓవర్ యాక్షన్‌తో మరోసారి విమర్శలపాలయ్యారు. షార్ట్ వేసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చారన్న కారణంగా బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు.

షార్ట్‌లో వచ్చిన బాధితులకు పోలీస్ స్టేషన్‌లోకి నో ఎంట్రీ.. లేడీ పోలీసులు ఉన్నారంటూ..
Shorts (Representative Image)

కోల్‌కతా పోలీసులు ఓవర్ యాక్షన్‌తో మరోసారి విమర్శలపాలయ్యారు. షార్ట్ వేసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చారన్న కారణంగా బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో చోరీ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు వింత అనుభవం ఎదురయ్యింది. దత్తా(33), అవిశేక్ దె బిశ్వాస్(31)ల కుటుంబ ఆలయంలో చోరీ జరిగింది. ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వారిద్దరు ఈ నెల 17న కోల్‌కతాలోని కస్బ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే ఇద్దరూ షార్ట్ ధరించి ఉన్నారన్న కారణంతో పోలీస్ స్టేషన్‌ ఎంట్రన్స్‌లో ఓ పోలీసు(సివిల్ డ్రెస్‌లో ఉన్నారు) వారు పీఎస్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. షార్ట్‌లో వస్తే పోలీస్ స్టేషన్‌కు అనుమతించేది లేదని చెప్పారు. ఏదోలా ఆ పోలీస్‌కు సర్దిచెప్పి  స్టేషన్‌లోకి వెళ్లినా.. అక్కడున్న డ్యూటీ ఆఫీసర్ వారి దగ్గరి నుంచి ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులున్నారంటూ .. ఇంటికి వెళ్లి ప్యాంట్‌లు వేసుకుని వస్తేనే ఫిర్యాదు తీసుకుంటామని చెప్పారు. చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్‌కు సమీపంలో నివసిస్తున్న దత్తా ప్యాంట్ వేసుకుని గంట తర్వాత వచ్చాక పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.

సామాజిక మాధ్యమంలో పోస్ట్..
పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు డ్రెస్ కోడ్ పై స్పష్టత కావాలంటూ బాధితులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కోల్‌కతా పోలీసులు…మీ కార్యాలయాలకు షార్ట్ ధరించే వెళతారా? అంటూ ట్వీట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో డ్రెస్ కోడ్‌పై ప్రశ్నించడం పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు కాదని..నిజానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా? అని తెలుసుకోవాలని ఉందంటూ దత్తా పేర్కొన్నాడు. ప్యాంట్ వేసుకుని వచ్చాక ఫిర్యాదు తీసుకునే విషయంలో పోలీసులు తనకు బాగా సహకరించారని కూడా మెచ్చుకున్నారు.

కాగా పోలీస్ స్టేషన్లను సందర్శించే వారికి డ్రెస్ కోడ్ లేదని పలువురు ఐపీఎస్ అధికారులు స్పష్టంచేశారు. అనూహ్యకర సందర్భాల్లో బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి ఉంటుందని, డ్రెస్ కోడ్ కారణంగా చూపుతూ వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోవడం సరికాదన్నారు. బలగాలకు మాత్రమే డ్రెస్ కోడ్ ఉంటాయని కొల్‌కతా మాజీ పోలీస్ కమిషన్ ప్రసూన్ ముఖర్జీ స్పష్టంచేశారు. ఇది కొందరి వ్యక్తిగత అభిప్రాయమే తప్ప..పోలీస్ వ్యవస్థలో డ్రెస్ కోడ్‌కు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవన్నారు.

చివరకు ఈ వ్యవహారంలో పోలీసుల తప్పు చేసినట్లు ఉన్నతాధికారులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారికి ఎలాంటి డ్రెస్ కోడ్ లేదని స్పష్టంచేశారు. షార్ట్‌లో వచ్చినందుకు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారంనాడు దత్తా, బిశ్వాన్‌తో ఫోన్‌లో మాట్లాడి స్టేషన్‌కు పిలిపించిన ఓ సీనియర్ అధికారి..ఫిర్యాదు తీసుకునే విషయంలో పొరబాటు జరిగినట్లు వారికి నచ్చజెప్పారు.

Also Read..

మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో దారుణం.. హత్య కేసు విచారణలో నివ్వెరపోయిన పోలీసులు

లగ్జరీ సైకిల్ కనిపిస్తే చాలు స్కెచ్ వేసేస్తాడు..! దొంగగా మారిన 24 ఏళ్ల నిరుద్యోగి..

Click on your DTH Provider to Add TV9 Telugu