Viral News: మీ ఆత్మలు శాంతించుగాక! ఈగలు, బొద్దింకలకు నివాళి.. 40ఏళ్లుగా సాగుతున్న వింత సంప్రదాయం..?
సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు మనం నివాళులు అర్పించడం చూస్తాము. అలాగే, కొన్నిసార్లు కొందరు తమ ప్రియమైన పెంపుడు జంతువులు చనిపోయినప్పుడు కూడా నివాళులు అర్పిస్తారు. కానీ, కీటకాలు చనిపోయినప్పుడు ఎవరైనా మౌనం పాటించటం, నివాళులు అర్పించటం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? కానీ, ఒక పురుగుమందుల కంపెనీ ప్రతి సంవత్సరం అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో ఇక్కడ చూద్దాం...

కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది చనిపోతే కనీసం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు చాలా మంది. కానీ, చనిపోయిన కీటకాలకు నివాళులు అర్పించే కంపెనీ ఒకటి ఉంది. అవును, సదరు కంపెనీ గత 40 సంవత్సరాలుగా వారు చంపిన కీటకాలకు వారే నివాళులు అర్పిస్తారు. వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇది నిజమే నండోయ్… ఎర్త్ కార్పొరేషన్ జపాన్‌లో అత్యుత్తమ గృహ పురుగుమందుల సంస్థ. దశాబ్దాల పరిశోధన ద్వారా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. దాని ఉత్పత్తుల ప్రభావాన్ని పరీక్షించడానికి, కంపెనీ అకోలోని దాని పరిశోధనా కేంద్రంలో వివిధ కీటకాల జాతులను ఉపయోగిస్తుంది.
పరిశోధన ప్రక్రియలో కొన్ని కీటకాలు చనిపోతాయి. ఎర్త్ కార్పొరేషన్ కీటకాల మరణాలను తేలికగా తీసుకోదు. ఇందులో భాగంగా గత 40 సంవత్సరాలుగా వారు చంపిన కీటకాలకు వారు నివాళులు అర్పిస్తున్నారు. ఇది అకో నగరంలోని మైయోడోజీలో ఈ కీటకాలకు స్మారక సేవను నిర్వహిస్తుంది. గత నెలలో 60 మందికి పైగా సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చనిపోయిన కీటకాల ఫోటోల ముందు వారంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దోమలు, ఈగలు, బొద్దింకలు, ఇతర కీటకాల ఫోటోలను అక్కడ ఉంచి ప్రజలు వాటి కోసం ప్రార్థిస్తారు. ఎర్త్ కార్పొరేషన్ పరిశోధన బృందం కోసం 1 మిలియన్ బొద్దింకలు, 100 మిలియన్లకు పైగా కీటకాలను ఉపయోగిస్తుంది. ఈ కీటకాలు మానవుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తాయి. అందువల్ల, మరణించిన కీటకాలకు నివాళులు అర్పించడానికి ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎర్త్ కార్పొరేషన్ గత నాలుగు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేకమైన వేడుకను నిర్వహిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




