Andhra Pradesh: అయ్యో పాపం.. ఆ కుక్కకు ఎంత కష్టమొచ్చిందో.. ఆకలి తట్టుకోలేక ఆశగా వెలితే.. ఏమైందో మీరే చూడండి..
Andhra Pradesh News: కొంత మంది స్ధానికులు దాని ఇబ్బంది గమనించి డబ్బా తొలగించటానికి ప్రయత్నించారు. కాని అది వాళ్లకు చిక్కకుండా పారిపోయింది. మరోవైపు సాటి కుక్కలు సైతం అదేదో వింత జంతువన్నట్లు తరమటంతో అది అడవుల్లో కి పారిపోయి ప్రాణం కాపాడుకుంది. కాని ఆకలిదప్పులకు ఎలా తట్టుకుంటుందోనని స్థానికులు జాలి పడుతున్నారు.
ఏలూరు, జులై 24: ఆకలితో ఉన్నపుడు చద్ది అన్నం కూడా పరమాన్నం గా మారుతుందంటారు కదా. అదే ఆకలితో ఒక కుక్క ఆశగా ఒక డబ్బాలో మూతి పెట్టింది. ఆబాగా అందులో ఆహారం తినాలని ప్రయత్నించింది. చివరికంటా నాలుక చాచి నాకటం మొదలు పెట్టింది. ఇక్కడ వరకు సీన్ బాగానే ఉంది కానీ, ఇపుడు దాని తల డబ్బాలో ఇరుక్కుపోవడం తో తోటి కుక్కలు సైతం అది తమ జాతి జంతువు కాదనుకుని తరుముతున్నాయి. దీంతో అది అడవిలోకి పారిపోయింది…ఈ ఘటన ఏలూరు జిల్లా కుక్కునూరు లో జరిగింది.
మనం చిన్నప్పుడు చాలా కథలు చదివి ఉంటాము విని ఉంటాము. అందులో కొంగ – నక్క లో మధ్య విందు కధ చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. కొంగను విందు కు పిలిచిన నక్క పాయసాన్ని వెడల్పాటి కంచంలో పోయటంతో దాన్ని కొంగ తాగలేకపోతుంది..కాని అదే పాయసాన్ని నక్క తన నాలుకతో మొత్తం నాకుతూ తాగేస్తుంది. ఇది అవమానం గా భావించిన కొంగ మరోసారి నక్కను విందుకు పిలిచి సన్న మూతి ఉన్న లోతైన పాత్రలో పాయసం వడ్డిస్తుంది. దీంతో నక్క పాయసం తాగలేకపోవటం, అదే పాత్రలో తన పొడవాటి మూతిని పెట్టి మొత్తం పాయసం కొంగ తాగేయటమే కథ. ఈ కథ లో కొంగ, నక్కల మధ్య జరిగిన ఘటనలు ఒకదానిపై మరొకటి పగ తీర్చుకునే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఇదే సందర్భంలో ఒక్కో జంతువుకు , పక్షులకు కొన్ని పరిమితులు ఉంటాయి. కొంగలు వెడల్పాటి కొంచెం లో ఎంత రుచికరమైన పాయసం పోసిన అవి తన పొడవాటి ముక్కుతో తాగలేవు అలాగే సన్నని మూతి ఉన్న లోతైన పాత్రలో మూతి పెట్టి నక్క ఆహారం తినలేదు. కాని ఈ కథ తెలియకనో లేక పూర్వానుభవం లేకనో ఓ కుక్క కుక్కునూరు లో సన్నని మూతి ఉన్న డబ్బాలో తల పెట్టి అది బయటకు రాక ఇరుక్కుపోయింది. అలాగే రోడ్లపై తిరగటం మొదలు పెట్టింది. కొంత మంది స్ధానికులు దాని ఇబ్బంది గమనించి డబ్బా తొలగించటానికి ప్రయత్నించారు. కాని అది వాళ్లకు చిక్కకుండా పారిపోయింది. మరోవైపు సాటి కుక్కలు సైతం అదేదో వింత జంతువన్నట్లు తరమటంతో అది అడవుల్లో కి పారిపోయి ప్రాణం కాపాడుకుంది. కాని ఆకలిదప్పులకు ఎలా తట్టుకుంటుందోనని స్థానికులు జాలి పడుతున్నారు.