Viral Video: ఒరెయ్.. అది కొండచిలువరా… స్కిప్పింగ్ తాడు కాదు…
మన పిల్లలు పామును చూస్తే ఆమడదూరం పరిగెడతారు. బిగ్గరగా అరుపు, ఏడుపు లఖించుకుంటారు. కానీ ఈ పిల్లలు కొండచిలువను.. స్కిప్పింగ్ తాడులా వాడుకుంటూ ఆడుకున్నారు. వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లల ప్రవర్తనను చాలామంది తప్పు పడుతున్నారు. అక్కడే ఉన్న ఓ మహిళను తిట్టి పోస్తున్నారు.

పాములు అంటే ఎవ్వరైనా భయపడతారు. ముఖ్యంగా పిల్లలైతే సుస్సు పోసుకుంటారు. అంతెందుకు పాము ఫోటో చూసినా జడుసుకుంటారు. కానీ ఆస్ట్రేలియాలోని ఈ పిల్లలు మాత్రం.. పామును స్కిప్పింగ్ తాడుగా ఉపయోగించి ఆడుకున్నారు. నిజమండీ బాబు.. ఆ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వూరాబిండా ప్రాంతంలో ఈ వీడియో రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. పిల్లలు పాముపైకి దూకుతున్నప్పుడు నవ్వుతూ ఉండగా, ఒక మహిళ వారిని పర్యవేక్షిస్తూ వీడియో తీసింది. “అది నాకు చూపించు, అది ఏమిటో నాకు చూపించు” అని వీడియోలో ఆ మహిళ అనడం వినపడింది. అది నల్లటి తల గల పైథాన్ అని ఓ బాలుడు చెప్పుకొచ్చాడు. ఆ పైథాన్ చనిపోయిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
ఈ వీడియో వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో వందలాది వ్యూస్ వచ్చాయి. అక్కడి పర్యావరణం, పర్యాటకం, సైన్స్, ఇన్నోవేషన్ శాఖ దృష్టికి కూడా ఈ వీడియో వెళ్లింది. “ఈ అనుచిత ప్రవర్తనను మేము ఖండిస్తున్నాము. సంఘటనపై దర్యాప్తు చేస్తాము” అని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
Australian Aboriginal children use dead python as a skipping rope in Woorabinda, Queensland pic.twitter.com/1VfIdL3hIs
— Clown Down Under 🤡 (@clowndownunder) March 10, 2025
సోషల్ మీడియా యూజర్లలో ఒక వర్గం కూడా ఆ వీడియోను చూసి ఆగ్రహించారు. ఒకవేళ ఆ పాము చనిపోయి ఉంటే.. దానిని ఖననం చేయాల్సింది పోయి ఇలా ఆటలు ఆడటం ఏంటి అని మండిపడ్డారు. ‘పిల్లల్లో ఈ రకమైన ప్రవర్తనకు అలవాటు పడితే.. పెద్దయ్యాక వారు క్రూరమైన మనుషులుగా మారతారని’ మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.
ఆస్ట్రేలియాలో నల్లటి తల గల కొండచిలువను చంపడం లేదా గాయపరచడం నేరం. వాటికి హాని కలిగిస్తే గరిష్ట జరిమానా రూ. 6.9 లక్షలు ($7,952). జైలు శిక్ష కూడా పడవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
