కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు. తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె ఆమె. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో కీలక నాయకురాలైన ఆమె.. ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలిగా ప్రతినిథ్యంవహించారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. 2020 నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. బీ టెక్, ఎంఎస్ చదవుకున్న కె కవిత.. 2006లో భారత్‌కు తిరిగిరావడానికి ముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. కవిత వ్యాపారవేత్త దేవనపల్లి అనిల్ కుమార్‌తో వివాహంకాగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి కేసీఆర్‌తో కలిసి కె కవిత చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ కళలు, సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఆమె 2006లో తెలంగాణ జాగృతి సంస్థను నెలకొల్పారు. గతంలో బతుకమ్మ పండుకను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణతో పాటు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కె కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను 2024 మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.