మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళల కోటా కోసం పోరాటం చేస్తాం -ఎమ్మెల్సీ కవిత
లండన్ లోని పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా “మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఆమె మాట్లాడుతూ... మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు.
లండన్ : భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చని నేపధ్యంలో భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారత్ ఆమోదించిందని తెలిపారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకురావడంలో 1996లో దేవే గౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ, 2023లో ప్రధాని నరేంద్ర మోడీ కీలకంగా వ్యవహరించారని, వారికి ధన్యవాదాలు తెలిపారు.
లండన్ లోని పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా “మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఆమె మాట్లాడుతూ…
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని, ప్రధాన మంత్రికి కూడా సీఎం కేసీఆర్ లేఖ రాశారని వివరించారు. అయితే, మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడం ఆందోళకరమని, ఓబీసీ మహిళలకు న్యాయం చేయడం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సగం జనాభాను ఇంటికి పరిమితం చేస్తే దేశానికి మంచింది కాదని అభిప్రాయపడ్డారు. దీన్ని గమనించిన అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు మహిళా బిల్లుకు సానుకూలత వ్యక్తం చేశారని, తద్వారా మహిళా రిజర్వేషన్ సాకారమయ్యిందని పేర్కొన్నారు. 1950లో రాజ్యాంగ చర్చలు జరుగుతున్న సందర్భంలో తాము కూడా పురుషులతో సమానంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందున రాజకీయ రంగంలో తాము రాణిస్తామని, కాబట్టి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు అవసరం లేదని సరోజినీ నాయుడు వంటి వారు వాదించారని గర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై చర్చ జరిపి రాజ్యాంగంలో పొందుపర్చారని, కానీ మహిళా నాయకులు మహిళా రిజర్వేషన్లను నిరాకరించారని చెప్పారు. అయితే, తమకు రాజకీయ పార్టీలు అవకాశం కల్పించడం లేదని 1970ల్లో మహిళలు గ్రహించారని, దాంతో మహిళలకు రిజర్వేషన్లపై చర్చ మొదలైందని అన్నారు. 1972లో భారత దేశంలో మహిళల పరిస్థితి అనే అంశాన్ని ఐక్యరాజ్య సమితి ఇతివృత్తంగా తీసుకుందని, ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మహిళల పరిస్థితిపై విస్తృతంగా సర్వే నిర్వహించి మహిళా అంశాలపై దృష్టిసారించడం లేదని తేల్చిందని వివరించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో మొదటగా గీతా ముఖర్జీ, సీపీఎం, సీపీఎం పార్టీలు, ఐద్వ సంస్థ కీలక పాత్ర పోషించాయన్నారు. మహిళా బిల్లు కోసం 1990ల్లోనే తన నియోజకవర్గం నిజామాబాద్ లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ధర్నాలు జరిగినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. 1996లో దేవే గౌడ ప్రభుత్వం నుంచి మహిళా బిల్లు కోసం ప్రయత్నాలు జరిగి చివరికి ఇటీవల పార్లమెంటు బిల్లును ఆమోదించిందన్నారు. భవిష్యత్తులో మహిళలకు మంచిరోజులు వస్తాయని ఆకాంక్షించారు. అడగకుండానే బీఆర్ అంబేద్కర్, జవహార్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి నాయకులు మహిళలకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. యూకే, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో మహిళలకు ఓటు హక్కు కోసం దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు.
ఒకటి రెండు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమలవుతున్నాయని, స్థానిక పరిపాలనలో మహిళల భాగస్వామ్యం దాదాపు 57 శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవుల్లో దాదాపు 55-57 శాతం మంది మహిళలే ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. వారిలో 92 శాతం మంది తమ పార్టీకి చెందినవారేనని అన్నారు.
మానవ సమాజంలో పురుషుల ఆధిపత్యం ఎందుకు పెరిగింది ? ఎందుకు మహిళలను అణచివేయాలన్న ఆలోచనలు వచ్చాయి ? కేవలం మానువుల్లోనే ఎందుకు ఇలా జరిగింది ? సహచర మనిషిని ఎలా అణగదొక్కుతారు ? ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మహిళల నుంచి ఎన్నో ఎలా ఆశిస్తారు ? వంటి సీరియస్ ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారాలు కనుక్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లక్షలాది మహిళలకు అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో స్థానిక సంస్థల్లో 14 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నా అందులో మెజారిటీ స్వతంత్రంగా వ్యహరించే పరిస్థితి లేదని తెలిపారు. కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి సరిదిద్దాలన్నారు. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ తో కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక మహిళల ఆరోగ్యంపై పరిశోధనా నివేదికలు, పుస్తకాలు కూడా పెద్దగా లేకపోవడాన్ని కూడా కవిత ప్రస్తావించారు. వైద్య పరిశోధనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేది కేవలం పురుషుల ఆరోగ్యంపై పరిశోధన చేయడానికేనా అని ప్రశ్నించారు. మహిళల ఆరోగ్యం ఎందుకు ముఖ్యం కాదని అడిగారు. మహిళల అంశాలను, అవసరాలను విస్మరించడం సరికాదని సూచించారు.
స్టార్టప్ విషయంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. 10 స్టార్టప్ కంపెనీలు ఏర్పడితే మహిళా నేతత్వంలో కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటున్నాయని తెలిపారు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్ లకు ఆర్థిక సాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితికి రాజకీయవేత్తలు అందరూ దోషులేనని చెప్పారు. సరిహద్దులు మరిచి ప్రపంచవ్యాప్తంగా మహిళా అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లు లేని దేశాల మహిళలకు సాయం చేయడం భారత మహిళలు విధిగా భావించాలని అన్నారు. ఇలాంటి బంధం లేకపోతే ప్రగతి సాధించలేమన్నారు. వేల సంవత్సరాల నుంచి మహిళలను విస్మరిస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కవితకు ప్రశంసల వెల్లువ
దేశ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను సాధించడంలో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితకు లండన్ లో ప్రశంసలు వెల్లువెత్తాయి. చట్టసభల్లో అత్యల్పంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కవిత కృషి చేశారని వక్తలు కొనియాడారు. మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భారత దేశ రాజధానిలో ఒక రోజు దీక్ష చేయడమే కాకుండా ప్రజల్లో ఈ అంశంపై చర్చ రేకిత్తడానికి రౌండ్ టేబుల్ సమావేశాన్ని సైతం నిర్వహించారన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశ పార్లమెంటులో 1950ల్లో 5 శాతం ఉన్న మహిళల ప్రాతినిధ్యం ప్రస్తుతం కేవలం 15 శాతానికి మాత్రమే పెరిగిందని తెలిపారు. 33 శాతం రిజర్వేషన్లు సాధించడం పెద్ద విజయమని, అది సాధించడానికి కవిత కృషి గణనీయమని స్పష్టం చేశారు. కవిత వంటి రాజకీయవేత్తల వల్లనే మహిళా రిజర్వేషన్లు సాధ్యమైందని అన్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం కోసం కవిత ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
ఆకట్టుకున్న కవితపై వీడియో ప్రదర్శన
మహిళా రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత చేసిన కృషిపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రదర్శించిన ఒక వీడియో సభికులను ఆకట్టుకుంది. 2014లో మొట్టమొదటి సారిగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ నుంచి పార్లమెంటుకు ఎన్నికైక కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో మహిళా సాధికారత కోసం పనిచేశారని ఆ సంస్థ తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్లపై తీర్మానాన్ని ఆమోదించి కేసీఆర్ చరిత్రను సృష్టించారని వివరించింది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కల్వకుంట్ల కవిత తరుచూ మహిళా రిజర్వేషన్లపై పార్లమెంటులో లేవనత్తేవారని తెలిపింది. ఆ తర్వాత కాలంలోనూ అనేక సందర్భాల్లో ఆయా వేదికలపై ప్రస్తావిస్తూ ప్రజాబాహుల్యంలోఈ అంశంపై చర్చను సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారని స్పష్టం చేసింది.