Hyderbad: కుస్తీ పోటీల్లో పహిల్వాన్‌ల మధ్య ఘర్షణ..  పరస్పర దాడులు

Hyderbad: కుస్తీ పోటీల్లో పహిల్వాన్‌ల మధ్య ఘర్షణ.. పరస్పర దాడులు

Noor Mohammed Shaik

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 07, 2023 | 12:45 PM

హైదరాబాద్‌లో కుస్తీ పోటీలు కాస్తా వర్గపోరుగా మారాయి. ఇరు పక్షాల మధ్య తలెత్తిన వివాదంలో మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. హైదరాబాద్‌ లాల్‌బహదూర్‌ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో జఫర్‌ ఫైల్వాన్‌, సాలం పైల్వాన్‌ మధ్య పోటీ జరిగింది. అయితే ఈ పోటీల్లో గెలపు మాదంటే మాదంటూ వాగ్వాదానికి దిగారు.

ఒక వర్గం వారు ప్రత్యర్ధులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడంతో కుస్తీ పోటీ కాస్తా ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ కొట్లాటలో పదిమందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కుస్తీపోటీల్లో పాల్గొన్న ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే కుస్తీ పోటీల్లో పాల్గొన్న పైల్వాన్‌లు బంధువులే కావడం విశేషం.

ఒకప్పుడు పైల్వాన్‌ అంటే ప్రజలకు అండగా నిలిచేవారు. ప్రస్తుతం పైల్వాన్‌ అంటే రౌడీ షీటర్లుగా. భూ కబ్జాదారులకు అండగా మారిపోయారని, రాను రాను వీరి ఆగడాలు పెరిగిపోతున్నాయని గతంలో అనేక సందర్భాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఫిర్యాదులు కూడా చేశారు. వీరిపై హైదరాబాద్‌ పోలీసులు దృష్టి సారించి కొందరు పైల్వాన్‌ల అక్రమాలకు అడ్డుకట్టవేయాలని నగరవాసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Published on: Oct 07, 2023 12:45 PM