Ambedkar Jayanti: ఆంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తిగా సీఎం కేసీఆర్ పాలన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్..
Ambedkar Jayanti: హన్మకొండలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి..
Ambedkar Jayanti: హన్మకొండలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రంసంగించారు. భీంరావ్ రాంజీ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్త అని, ఆయన బహుళ అంశాల్లో ప్రజ్ఞశాలి అని కొనియాడారు. న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త అయిన అంబేద్కర్.. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. మహర్ కులానికి చెందిన అంబేద్కర్ చిన్న నాటి నుంచే కుల వివక్షను, అంటరాని తనాన్ని ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు.
చదువులో ప్రతిభావంతుడైన అంబేద్కర్, అప్పటి బరోడా మహారాజు సహకారంతో విదేశాల్లో చదువుకున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎకానమిక్స్‌లో డాక్టరేట్ తీసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అంబేద్కర్ వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. 1927లో మహారాష్ట్రలోని మహద్‌లో దళిత సభ పెట్టి, వేలాది మంది మహర్లతో చెరువులో నీటిని తీసుకునేలా చేశారంటూ అంబేద్కర్ గొప్పతనాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రశంసించారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని మొదట పోరాటం చేసింది అంబేద్కరే అని పేర్కొన్నారు. అంబేద్కర్ మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యాక.. దళితులకు రిజర్వేషన్లను కల్పించింది కూడా అంబేద్కరే అని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌లో అనేక మంది సభ్యులున్నప్పటికీ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ అని చెప్పుకొచ్చారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం అని, ఇవాళ మనమంతా ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమే అని అన్నారు.
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం.. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యనందిస్తున్నామని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశాల్లో చదువుకునే వాళ్ళ కోసం ఒక్కొక్కరికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్‌తో పాటు.. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మంత్రి కేటీఆర్ హన్మకొండలో ప్రారంభించిన అంబేద్కర్ చౌరస్తాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. అలాగే పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పుస్తక ప్రతిమను పరిశీలించారు.
Also read: