Warangal: జెస్సీ.. ప్రేమకు ప్రతీక.. అందుకే వ్యవసాయ క్షేత్రంలో విగ్రహం..
కాస్త కన్‌సర్న్ చూపిస్తే చాలు.. కుక్కులు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అమితమైన ప్రేమను కురిపిస్తాయి. యజమానిని దైవంలా భావిస్తాయి.
కుటుంబ సభ్యులెవరైనా మరణిస్తే.. నాలుగు రోజులు బాధపడతారు. ఆ తర్వాత ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. మహా అంటే దశదిన కర్మరోజు లేదా వర్ధంతి రోజు ఫోటోకు దండవేసి దండం పెడతారు. చనిపోయిన వారిని రక్త సంబంధీకులే మర్చిపోతున్న ఈ రోజుల్లో పెంపుడు కుక్కపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు దాని యజమాని దంపతులు. కుక్క చనిపోయి ఆరు నెలలయినా దాని జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ లో విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. జెస్సీ.. ఇదే మా నివాళి అంటూ తమ పెంపుడు కుక్కకు విగ్రహం ఏర్పాటు చేసి.. దాని జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు వరంగల్ బ్యాంకు కాలనీకి చెందిన తౌటం ధనుంజయ, భాగ్యలక్ష్మి దంపతులు.
ఎనిమిదేళ్ల క్రితం ధనుంజయ, భాగ్యలక్ష్మి దంపతులు హైదరాబాద్‌లో రాట్‌వీలర్ జాతికి చెందిన కుక్కను కొనుగోలు చేశారు. పోలీసు జాగిలంగా ఎక్కువగా పెంచే ఈ జాతి శునకాన్ని ఇష్టంగా పెంచుకుంటూ జెస్సీ అని నామకరణం చేశారు. దానికి 10 పిల్లలు జన్మించాయి. ఆరు నెలల క్రితం ఆ శునకం అనారోగ్యంతో మృతిచెందగా ధనుంజయ దంపతులు తట్టుకోలేకపోయారు.
మచ్చాపురం వద్ద ఉన్న తమ వ్యవసాయ క్షేత్రంలో జెస్సీని ఖననం చేశారు. అంతటితో మరిచిపోలేక 25 వేల రూపాయలతో ఆ శునకం సైజులో రెండడుగుల విగ్రహం తయారు చేయించి ప్రతిష్ఠించారు. ఆ శునకానికి, తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, అందుకు గుర్తుగానే వ్యవసాయ క్షేత్రం వద్ద విగ్రహం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ధనుంజయ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..