తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదన్నారు. భారత గణతంత్ర దినోత్సవాలను కూడా రద్దు చేసే వరకు వెళ్లారన్నారు. గతంలో ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి చేయని రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్‌తో గణతంత్ర దినోత్సవ వేడుకలు చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారంటే..
సీఎం కేసీఆర్‌కి ఎందుకు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు వస్తాయో తెలియట్లేదు. రాజ్యాంగాన్ని, డా అంబేడ్కర్‌ను అవమానించేలా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఎన్నో రాష్ట్రాల్లో సీఎంకు, గవర్నర్‌కు విబేధాలు వచ్చాయి.. కానీ ఇంత దిగజారి ఎవరూ ప్రవర్తించలేదు. జీ-20 సమావేశానికి పిలిచినా రాలేదు. రాష్ట్రానికి ప్రధాని వస్తే కనీస మర్యాద ఉండదు. రాష్ట్రపతి వచ్చినా, మరెవరు వచ్చినా ఇదే తీరులో ఉంటారు. కృష్ణా జలాల మీద సమావేశం పెట్టినా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. కేసీఆర్ కారణంగా తెలంగాణ పరువు పోతోంది. రాష్ట్రం నష్టపోతోంది. దేశానికి ఒక విధానం తెలంగాణకు ఒక విధానం ఉండదు. వితండవాదం, కల్వకుంట్ల విచిత్ర వాదంతో వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరు ధర్నాలు చేయాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం కోసం కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
‘రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. గవర్నర్ ఎవరున్నా కనీస మర్యాదలు పాటించాలి. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను రానీయకుండా చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు, నేతలకు బుద్ధి చెప్పాలి. కేసీఆర్ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు. గుణాత్మక మార్పు అంటూ ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. పాలన పూర్తిగా దిగజారి, అవినీతిమయం అయింది. డబ్బుతోనే రాజకీయం చేస్తాను అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఉన్నది అంబేడ్కర్ రాజ్యాంగం కాదు, నిజాం రాజ్యాంగం అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నార’ని మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వ్యార్తల కోసం క్లిక్ చేయండి.