లోక్ సభ ఎన్నికల వేళ ఓటమి భయంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బిజెపిని నిలువరించే ఆలోచనతో జతకట్టార్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తోడుగా ఎంఐఎం పార్టీ కుమ్మక్కై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు తీసేస్తారని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ తలాతోక లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కిందస్థాయి నాయకులెవ్వరూ వారి మాటలను నమ్మడం లేదని చెప్పారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. మజ్లిస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఓల్డ్ సిటీలో ఓవైసీని గెలిపించాలని పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలొచ్చాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ బహిరంగంగా చెప్పారన్నారు. తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైలంట్‌గా కనపడుతున్నాయన్నారు. రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అవాస్తమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమైనట్లు తెలిపారు.
గత శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీలు ఇచ్చి, 100 రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గ్యారంటీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా.. నీతి, నిజాయితీతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలన అందిస్తోందని కొనియాడారు. నరేంద్ర మోదీ అన్ని వర్గాల ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో విజయం సాధించేలా ముందుకెళ్తున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ చివరి శ్వాస వరకు పేద ప్రజలకు రిజర్వేషన్లను మరింత సమర్థవంతంగా అమలు జరిగేలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, పేదలకు మరింత మేలు జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా మరింత స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున పునరుద్ఘాటిస్తున్నామన్నారు. రిజర్వేషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. తన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మకూడదని కోరుతున్నానన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..