AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రీమ్ జాబ్.. చేతిలో ఆఫర్ లెటర్.. తీరా ఎయిర్‌పోర్టుకు వెళ్తే అసలు సినిమా మొదలైంది..!

విదేశాల్లో ఉద్యోగం, చేతినిండా సంపాదన.. సగటు నిరుద్యోగి కల. ఈ కలనే పెట్టుబడిగా మార్చుకుని లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ట్రివియల్ చాప్టర్' (Trivial Chapter) అనే సంస్థ పేరుతో నిరుద్యోగులను నమ్మించి, నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

డ్రీమ్ జాబ్.. చేతిలో ఆఫర్ లెటర్.. తీరా ఎయిర్‌పోర్టుకు వెళ్తే అసలు సినిమా మొదలైంది..!
Airport Checking
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 8:55 PM

Share

విదేశాల్లో ఉద్యోగం, చేతినిండా సంపాదన.. సగటు నిరుద్యోగి కల. ఈ కలనే పెట్టుబడిగా మార్చుకుని లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ట్రివియల్ చాప్టర్’ (Trivial Chapter) అనే సంస్థ పేరుతో నిరుద్యోగులను నమ్మించి, నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితులు నిరుపమ, అరుణ్ రాజ్ వారి అనుచరులు అత్యంత పథకం ప్రకారం ఈ మోసాలకు తెరలేపారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేవారు. ముఖ్యంగా యూరప్ దేశాల్లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఉన్నాయని, వీసా ప్రాసెస్ చాలా సులభమని నమ్మించేవారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు సంస్థను సంప్రదించగానే, అసలు ఆట మొదలయ్యేది.

బాధితుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులు, వీసా ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో నిందితులు భారీగా డబ్బు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 రూపాయల నుండి మొదలుకుని 4 లక్షల రూపాయల వరకు దండుకున్నారు. నమ్మకం కలిగించడానికి నిందితులు బాధితులకు నకిలీ ఆఫర్ లెటర్లు, నకిలీ వర్క్ వీసాలు, కల్పిత అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేసేవారు. తీరా విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, ఆ పత్రాలను పరిశీలించినప్పుడు అవి నకిలీవని తెలియడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చివరికి మోసపోయామని గ్రహించిన పోలీసులను ఆశ్రయించారు.

ఎలాంటి అధికారిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ లైసెన్స్ లేకుండానే ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తునట్లు పోలీసులు విచారణలో తేలింది. గతంలో కూడా వీరు కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు (KPHB) పరిధిలో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిరుపమ, అరుణ్ రాజ్‌లను అరెస్ట్ చేయగా, ఈ కేసులో సంబంధం ఉన్న మరో 8 మంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లేవారు సదరు సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని, సోషల్ మీడియా ప్రకటనలను చూసి గుడ్డిగా డబ్బులు చెల్లించి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us