TSRTC: కండక్టర్ కుటుంబానికి అండగా టీఎస్ఆర్టీసీ.. రూ.40లక్షలు అందజేత.. అసలేం జరిగిందంటే..?
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో మెదక్ డిపోకు చెందిన కండక్టర్ సీహెచ్. అంజయ్య రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో మెదక్ డిపోకు చెందిన కండక్టర్ సీహెచ్. అంజయ్య రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. విధులు ముగించుకుని తన స్వగ్రామం నాగపూర్ కి బైక్ పై వెళ్తున్న ఆయనను.. త్రిబుల్ రైడింగ్ తో దూసుకువచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. మెదక్ జిల్లా హవేలి ఘనాపూర్ లోని టీ టైమ్ వద్ద జరిగిందీ ప్రమాదం. ఈ రోడ్డు ప్రమాదంలో సీహెచ్. అంజయ్యకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆయన మరణించారు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండక్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది.
ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్‌ను ఇటీవల యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40లక్షలు వరకు యూబీఐ అందజేస్తోంది.
హైదరాబాద్ బస్ భవన్ లో మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెదక్ డిపో కండక్టర్ సీహెచ్. అంజయ్య కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అందజేశారు. రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ అంజయ్య భార్య మణెమ్మ తో పాటు కుమారుడు సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. త్రిబుల్ రైడింగ్ తో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నిబద్దతతో విధులు నిర్వర్తించే అంజయ్య మరణించడం బాధకరమని అన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలిచిందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఈ ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు.
ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాలను యాజమాన్యం మార్చడం జరిగిందని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..