TSRTC: తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన దసరా.. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా.?
దసరా సీజన్ సందర్భంగా ఆర్టీసీ ఏకంగా రూ. 25 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాలకు వెళ్లిన వారు ఇంకా పూర్తి స్థాయిలో పట్టణాలకు చేరకపోవడం, పాఠశాలలకు ఇంకా సెలవులు ఉండడంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో...

దసరా పండుగ తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చింది. దసరా వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లిన వారితో పాటు తిరిగి పట్టణానికి చేరుకున్న వారు ఎక్కువగా ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో భారీ ఆదాయం వచ్చింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి అనుగుణంగానే ఆర్టీసీకి ఆదాయం కూడా భారీగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
దసరా సీజన్ సందర్భంగా ఆర్టీసీ ఏకంగా రూ. 25 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాలకు వెళ్లిన వారు ఇంకా పూర్తి స్థాయిలో పట్టణాలకు చేరకపోవడం, పాఠశాలలకు ఇంకా సెలవులు ఉండడంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకాలకు 5,500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. గతేడాదితో పోల్చితే ఈసారి 1302 బస్సులను అధికంగా నడపడం విశేషం.
ఈ ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు దిల్‌షుక్ నగర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్టీ నగర్‌ల నుంచి నడిపించింది. ప్రత్యేక బస్సులకు కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేయడంతో ప్రయాణికులు ఆర్టీసీకి మొగ్గు చూపారు. ఇక డైనమిక్ ఛార్జీలు కూడా ఆర్టీసీకి ఆదాయం పెరగడానికి మరో ముఖ్య కారణంగా చెప్పొచ్చు. ప్రయాణికులు ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ ధరలు వసూలు చేయడమే డైనమిక్ ఫేర్ ఉద్దేశం. అయితే ఈ ఫేర్ కూడా ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చితే తక్కువగా ఉండడం ఆర్టీసికి కలిసొచ్చింది. బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, చెన్నయ్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఈ డైనమిక్ ఫేర్‌ను ఎక్కువగా వినియోగించుకున్నారు.
సాధారణ రోజుల్లో తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ. 12 నుంచి రూ. 13 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే దసరా సందర్భంగా అదనంగా రోజుకు రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా ఒక రోజులో రూ. 19 కోట్ల వరకు ఆదాయ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 10 రీజియన్స్‌లో సుమారు రూ. 2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
