అన్ని పార్టీల్లోనూ అక్టోబర్ టెన్షన్.. ధమ్సప్ వచ్చేది ఎవరికి.? ధమ్‌కీ ఇచ్చేది ఎవరికి.!
ఇక్కడ ఎవరికివాళ్లు ఆఠీన్ రాజాలు, కళావర్ కింగులే. కాకపోతే.. అందరి చూపు ఆ జోకర్ ముక్క వైపే. ఆ ఒక్క ముక్కా పడితేనే ఎవరికైనా షో తిప్పే అవకాశం.. విక్టరీ సింబల్ చూపే లక్కీ ఛాన్స్. ఔనండీ బాబూ... ఐదు రాష్ట్రాల ఎన్నికల సీజన్లో పూటపూటకూ జాతకచక్రాలు మారిపోతున్నాయ్. జాతీయ పార్టీలన్నింటికీ..

ఇక్కడ ఎవరికివాళ్లు ఆఠీన్ రాజాలు, కళావర్ కింగులే. కాకపోతే.. అందరి చూపు ఆ జోకర్ ముక్క వైపే. ఆ ఒక్క ముక్కా పడితేనే ఎవరికైనా షో తిప్పే అవకాశం.. విక్టరీ సింబల్ చూపే లక్కీ ఛాన్స్. ఔనండీ బాబూ… ఐదు రాష్ట్రాల ఎన్నికల సీజన్లో పూటపూటకూ జాతకచక్రాలు మారిపోతున్నాయ్. జాతీయ పార్టీలన్నింటికీ ఇజ్జత్ కా సవాల్‌గా మారిన ఫైవ్ స్టేట్స్ ఎలక్షన్స్‌లో కిస్మత్ ఎవరి వైపు మొగ్గు చూపుతోంది. ఏమైనా క్లారిటీ వచ్చిందా లేదా?
జ్వరాల సీజన్ జనాన్నే కాదు.. రాజకీయ నాయకుల్ని కూడా నిలువునా వణికిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తేదీలు వచ్చీరాగానే నేతల్లో బీపీలు అమాంతం పెరిగిపోయాయ్. వ్యూహరచనతో బుర్రల్ని ఎంత వేడెక్కించుకుంటున్నా… లాభం లేకపోతోంది. ఓటరు నాడి దొరికినట్టే దొరికి ధమ్‌కీ ఇస్తోంది. ఎవరికివాళ్లు అదృష్టరేఖల్ని తడిమిచూసుకుంటున్నారు.
ఐదు రాష్ట్రాలు, 161 మిలియన్లకు పైగా ఓటర్లు, 679 అసెంబ్లీ సెగ్మెంట్లు… దేశ రాజకీయ ముఖచిత్రాన్ని డిసైడ్ చేసే కీలక ఎన్నికలివి. నవంబర్ 7న మిజోరంలో మొదలయ్యే ఓట్ల సీజన్… తెలంగాణలో పోలింగ్ తేదీ నవంబర్ 30 దాకా కొనసాగుతుంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఖరారు, మేనిఫెస్టో డిజైనింగు, ప్రచార వ్యూహాలతో సతమతమవుతున్నాయి. కొన్నిచోట్లయితే పొలిటికల్ సినిమా క్లయిమాక్స్‌లోకొచ్చేసింది. తెలుగు రాష్ట్రం కనుక తెలంగాణ దంగల్‌పైనే మనోళ్లకు ఫోకస్ ఎక్కువ. కానీ.. నాటోన్లీ తెలంగాణ… ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలూ జాతీయస్థాయిలో రాజకీయ ప్రకంపనలు లేపుతున్నాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా తరహాలో పోటీ జరుగుతోంది. రెండు జాతీయ పార్టీల బలాబలాల్ని తేల్చే సిసలైన ఫలితం ఇది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్.. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుపు ఢంకా మోగించింది. కానీ.. ఆరు నెలల గ్యాప్ తర్వాత సీన్ పూర్తిగా రివర్సైంది. మూడు రాష్ట్రాలకు చెందిన 65 లోక్‌సభ స్థానాల్లో 62 స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓటరు పల్స్ ఎంత స్పీడ్‌గా టర్న్ అవ్వొచ్చన్నదానికి అదొక గ్రేట్ ఎగ్జాంపుల్. అందుకే.. గత అనుభవాల్ని రీకాల్ చేసుకుంటూ.. అత్యంత జాగ్రత్తగా పాచికలేస్తున్నాయి పార్టీలు.
2018లో ఎన్నికలు జరిగిన ఇదే ఐదు రాష్ట్రాల్లో పార్టీల పెర్ఫామెన్స్ చూస్తే.. 45 శాతం ఓట్లతో అత్యధికంగా 306 స్థానాలు గెల్చుకుంది కాంగ్రెస్ పార్టీ. 29 శాతం ఓట్లతో 199 స్థానాల్లో బీజేపీ నెగ్గింది. మిగతా పార్టీలకు 174 స్థానాలు, 26 శాతం ఓట్లు దక్కాయి. మరి.. ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోంది..? పోలింగ్‌కి మరికొన్ని రోజులు మాత్రమే గ్యాప్ ఉన్న ఈ సమయంలో ఏ పార్టీ ఎంత ధీమాతో ఉంది? దేశవ్యాప్తంగా ఇదొక ఆసక్తికరమైన చర్చ.
ఐదు రాష్ట్రాల్లోనూ తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి చెంపపెట్టుగా మారబోతున్నాయనేది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట. అటు.. బీజేపీని ఎదుర్కోడానికి ఈ ఏడాది ప్రారంభంలో 26 పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాయి. కానీ.. ఈ కూటమి లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుంది.. అంటూ కండిషన్ పెట్టుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న వ్యూహాన్ని పక్కకుపెట్టి తప్పించుకున్నాయి ఎన్డీయేతర పక్షాలు. కానీ… ఆ మెగా కూటమికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు అగ్నిపరీక్ష లాంటివే. ఒక్క రాజస్థాన్‌లో అధికారం నిలబెట్టుకుంటే చాలు… 2024లో కేంద్రంలో పగ్గాలు తమకేనని ఓపెన్‌గా చెప్పుకున్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గె. అటు.. బీజేపీ కూడా ఇంతే సౌండ్‌తో తొడ కొడుతోంది. మోదీ జమానాకు ఇజ్జత్ కా సవాల్‌గా మారాయి ఐదు రాష్ట్రాల ఎన్నికలు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న మార్గాలు మూడేమూడు. ఒకటి.. మోదీ చరిష్మాను ఓట్లుగా మార్చుకోవడం. రెండోది.. కేంద్రమంత్రుల్ని, కీలక ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలో దింపడం. మూడోది… జీ20 సదస్సు సక్సెస్‌ని, మహిళా బిల్లు ఆమోదాన్ని వీలైనంత ఎక్కువగా ఎక్స్‌పోజ్ చెయ్యడం. అటు… కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా మూడు ట్రంప్‌కార్డుల్ని నమ్ముకుంది. మొదటిది కర్నాటక ఫార్ములాను రిపీట్ కొట్టడం. ఇబ్బడిముబ్బడిగా హామీల్ని గుప్పించడం.. సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడం. దాదాపుగా కర్నాటకలో విజయవంతమైన మేనిఫెస్టోనే చిన్నచిన్న మార్పులతో మిగతా రాష్ట్రాల్లో ప్రింట్లు కొట్టిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
రెండోది… రాహుల్‌తో పాటు.. మిగతా నేతలు పదేపదే పఠిస్తున్న కుల గణన మంత్రం. ఓబీసీలను బీజేపీకి దూరం చేసేందుకు జాతీయస్థాయి క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలన్న ఈ ప్రతిపాదన ఎంతవరకు పనిచేస్తుందనేది ఇప్పటికైతే సస్పెన్స్. మూడోది లోకల్ సెంటిమెంట్‌కి ప్రాధాన్యతనివ్వడం. ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో స్థానిక నాయకత్వానికి ఎక్కువగా స్వేచ్ఛనిస్తూ ముందుకెళుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇలా.. బ్రాండ్ న్యూ స్ట్రాటజీలతో ఐదు రాష్ట్రాల్నీ గెలుచుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. కానీ.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన రాజకీయ పరిస్థితి. పిడుక్కీ-బియ్యానికీ ఒకటే మంత్రం వేస్తే ఫలిస్తుందా..? పార్టీల ఎత్తుగడలకు ఓటర్లు ఎంతమేరకు ఫ్లాట్ అవుతారు అనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
