Delhi Pollution: కాలుష్య కోరల్లో హస్తిన.. ఊపిరి కోసం ఢిల్లీవాసుల అవస్థలు.!
కాలుష్య కోరల్లో చిక్కుకుని ఢిల్లీ అల్లాడిపోతోంది. హస్తిన వీధుల్లో తిరగాలంటేనే జనం జంకాల్సిన పరిస్థితి వచ్చింది. గంటగంటకూ పెరుగుతున్న గాలికాలుష్యంతో నగరం నరకం చూస్తోంది. ఏటా నవంబర్, డిసెంబర్‌లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈ సారి అక్టోబర్ నెలలోనే గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలో ఏ ఏరియాలో చూసినా దారుణాతి దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. సోమవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా చూపించింది.

కాలుష్య కోరల్లో చిక్కుకుని ఢిల్లీ అల్లాడిపోతోంది. హస్తిన వీధుల్లో తిరగాలంటేనే జనం జంకాల్సిన పరిస్థితి వచ్చింది. గంటగంటకూ పెరుగుతున్న గాలికాలుష్యంతో నగరం నరకం చూస్తోంది. ఏటా నవంబర్, డిసెంబర్‌లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈ సారి అక్టోబర్ నెలలోనే గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలో ఏ ఏరియాలో చూసినా దారుణాతి దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. సోమవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా చూపించింది. శుక్రవారం 108గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. ఆదివారానికి 266గా నమోదైంది. ఇక సోమవారానికి 300 పాయింట్లు దాటింది. NCR పరిధిలో కూడా గాలి నాణ్యత పడిపోయింది. దట్టమైన పొగమంచు ఢిల్లీని ఆవహించింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాదిపూర్, మందిర్‌మార్గ్, ప్రతాప్‌గంజ్, సోనియా విహార్, మోతి బాగ్‌తో ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యం కాటువేస్తోంది.
గత ఏడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా 1650 నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం వాయుకాలుష్యంలో ఢిల్లీ నగరమే అగ్రస్థానంలో ఉన్నట్లు తేలింది. అంటే ప్రపంచంలోనే అత్యంత పొల్యూషన్ ఉన్న నగరంగా ఢిల్లీ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఎక్కువ రోజులు గాలి పీలిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక గుండెపోటుతో పాటు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో సరి, బేసి విధానం అమలు చేసింది. వాహనాలు రోజువిడిచి రోజు రోడ్లమీదకు అనుమతించేలా చర్యలు తీసుకుంది. కానీ అవేమీ ఫలించలేదు. దీంతో లేటెస్ట్‌గా కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ సర్కార్.
రెడ్‌లైట్ ఆన్.. గాడీ ఆఫ్ అంటే.. సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజిన్లు ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాతే వాహనాలను ఆన్ చేసి ముందుకు కదలాల్సి ఉంటుంది. వాహనాలను ఆపేయడం ద్వారా కొంతసేపైనా వాటి నుంచి వచ్చే పొగను నియంత్రించవచ్చని భావిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ నెల 26నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. మరోవైపు వాయుకాలుష్యంపై అవగాహన కల్పించేలా నగరవ్యాప్తంగా రన్ అగైనెస్ట్ పొల్యూషన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది కేజ్రీవాల్ సర్కార్. ఇక గతేడాది దీపావళికి బాణాసంచా కాల్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ సారి కూడా అదే విధానాన్ని అమలుచేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం దసరా వేడుకల్లో కూడా టపాసులు పేల్చవద్దని కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
మరోవైపు బాణసంచా, చెత్తను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని.. సీఎన్‌జీ , ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఢిల్లీ మంత్రి గోపాల్‌రాయ్ కోరారు. పరిశ్రమల్లో కాలుష్య ఇంధనాలను ఫైన్డ్ నేచురల్ గ్యాస్ గా మార్చాలని, ఇటుక బట్టీల పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి జిగ్ జాగ్ టెక్నాలజీ ఉపయోగించాలని.. డీజిల్ జనరేటర్లపై ఆధారపడకుండా ఎన్ సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉంచాలని కోరారు.