సాగర్‌లో పోటీకి ముందుకొచ్చేదెవరు?.. బీజేపీకి ధీటుగా నిలబడేదెవరు..? అధికారపార్టీలో తర్జన భర్జనలు
ఇన్నాళ్లు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉండగా.. కొన్ని నెలలుగా రాష్ట్రంలో రాజకీయాలు.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయాయి.
Nagarjunasagar by poll 2021 : తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్వరాష్ట్రం సాధించాక, ఇన్నాళ్లు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉండగా.. కొన్ని నెలలుగా రాష్ట్రంలో రాజకీయాలు.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత టీఆర్ఎస్‌కు ధీటైన రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. ఈ క్రమంలోనే త్వరలోనే జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌తో పోలిస్తే బీజేపీకి పెద్దగా బలం లేదు. అయితే, ప్రస్తుతం తెలంగాణలో తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని భావిస్తున్న బీజేపీ నేతలు.. నాగార్జునసాగర్‌లో ఆధిక్యత సాధించాలని ఉవ్విళ్లురుతున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్‌కు త్వరలోనే ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్‌ను తిరిగి సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ పర్యటనలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసిన టీఆర్ఎస్ ముందు సాగవన్న సంకేతులు ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగా సాగర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది టీఆర్ఎస్. ఇప్పటికే ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బరిలోకి దిగడం ఖాయమైంది. ఇక, టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తారా లేక వేరే వారిని బరిలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది.
ఇక, నాగార్జునసాగర్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరన్నదానిపై పెద్ద చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్ బరిలో నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వకపోతే.. బీసీలకు కాకుండా రెడ్డి వర్గానికి చెందిన నేతలకు సీటు ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నా.. ఆయన అంత ఆసక్తిగా చూపడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. చిన్నపరెడ్డిని అధినాయకత్వం ఇప్పటికే పిలిచి మాట్లాడినట్లు సమాచారం. పోటీ నుంచి తప్పుకుంటున్నాని చిన్నపరెడ్డి ఏకంగా టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, చిన్నపరెడ్డి నిర్ణయం వెనుక పెద్ద వ్యుహమే ఉండి ఉండవచ్చని లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబానికి లేదా కోటిరెడ్డికి టికెట్ ఇచ్చినా ఎన్నికల ఖర్చు భారం పార్టీపైనే పడుతుందన్న ఆలోచనతో నాయకత్వం ఉందంటున్నారు. అందుకే సొంతంగా భరించే సామర్థ్యం ఉన్న వాళ్లకే పార్టీ టికెట్ ఇవ్వాలనుకుంటోంది అధినాయకత్వం.
అయితే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల నేతలు పోటీపడి కారెక్కేశారు. దీంతో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా.. చేతినిండా నేతలతో క్యాండేట్లకు కరువు లేకుండా పోయింది. ఒక్కో సీటుకు ముగ్గురు నలుగురు పోటీపడితే.. చివరికి ఛాన్స్ ఎవరికనేదానిపై పెద్ద చర్చే జరిగేది. అయితే, ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టికెట్‌కోసం నేతలు పెద్దగా పోటీపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది. గులాబీ పార్టీ టికెట్ తెచ్చుకుంటే చాలు.. ఆ బ్రాండ్‌తో గెలిచేస్తామని నమ్మిన నేతలు.. ఇప్పుడు గెలుపంత సులువు కాదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక, ఇక్కడి అభ్యర్థి ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ అచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ తరపున నాగార్జునసాగర్ బరిలో నిలిచేందుకు నివేదితా రెడ్డి, అంజయ్య యాదవ్ పోటీ పడుతున్నారు. అయితే, టీఆర్ఎస్‌కు చెందిన ముఖ్యనేత ఒకరు పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన గనక బీజేపీలో చేరితే, నాగార్జున సాగర్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.