AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి ఆశలతో ప్రయాణాలు.. కాటికి చేరిన వైనాలు.. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువులను బలి తీసుకుంటున్న ప్రమాదాలు

పెళ్లి బాజాలు మోగిన చోట చావు డప్పు వినిపిస్తోంది. మూడుముళ్ల బంధం ముడిపడిందన్న ఆనందం ఎంతోసేపు నిలవడం లేదు. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువులు కాటికి...

కోటి ఆశలతో ప్రయాణాలు.. కాటికి చేరిన వైనాలు.. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువులను బలి తీసుకుంటున్న ప్రమాదాలు
New Brides Deaths
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2021 | 3:43 PM

Share

పెళ్లి బాజాలు మోగిన చోట చావు డప్పు వినిపిస్తోంది. మూడుముళ్ల బంధం ముడిపడిందన్న ఆనందం ఎంతోసేపు నిలవడం లేదు. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువులు కాటికి చేరుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో పెళ్లింట విషాదాలు కంటతడిపెట్టిస్తున్నాయి. కాళ్ల పారాణి ఆరనే లేదు.. అప్పుడే కానరానీ లోకాలకు వెళ్లిపోయింది ప్రవళ్లిక అనే నవ వధవు. ఆమెది వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట. ఈనెల 26న రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డితో వివాహమైంది. ఆనందోత్సాహాల మధ్య పెళ్లి తంతు ముగిసింది. అమ్మానాన్నలకి, బంధువులకి బైబై చెప్పి పుట్టింటి నుంచి మెట్టింటికి బయలుదేరింది. కానీ కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అత్యుత్సాహం ప్రవళ్లికను పొట్టనబెట్టుకుంది. మర్పల్లి మండలం తిమ్మాపూర్‌ సమీపంలో రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. ఆ సమయంలో కారులో వధూవరులతో పాటు మరో నలుగురు ఉన్నారు. వారిలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. అందరూ వరద నీటిలో వెళ్లొద్దని వారించారు. గగ్గోలుపెట్టారు. కానీ డ్రైవర్‌ మొండిగా ముందుకెళ్లాడు. మృత్యువు రూపంలో వచ్చిన వరద అలజడి రేపింది.  వరుడు నవాజ్‌రెడ్డి క్షేమంగా బయటపడ్డాడు.. వధువు మాత్రం ప్రాణాలు విడిచింది. వివాహ ఘట్టం పూర్తయిందని బంధుగణం ఊపిరి తీసుకునేలోపే నవ వధువు ఊపిరి ఆగిపోవడం అందర్నీ కలచివేసింది. పట్టుచీరలో ముస్తాబై కారులో వెళ్లిన ప్రవళ్లిక విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నవాళ్లు కన్నీరుమున్నీరయ్యారు.

అంతకుముందు నిర్మల్‌జిల్లాలోనూ అదే విషాద గీతిక. కడెం మండలం పాండవపూర్ దగ్గర కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నవ వధువు మౌనిక, ఆమె తండ్రి రాజయ్య స్పాట్‌లోనే చనిపోయారు. పెళ్లి కొడుకు స్వల్ప గాయాలతో బతికి బయటపడితే.. వధువు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. మద్దిపడగ గ్రామానికి చెందిన మౌనికకు ఈనెల 25న మహారాష్ట్రకు చెందిన జనార్థన్‌తో వివాహమైంది. బంధువుల సమక్షంలో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వరుడి ఇంట రిసెప్షన్‌ కూడా గ్రాండ్‌గా ముగిసింది. కొత్త జంట వధువు ఇంటికి వెళ్తుండగా విధి వెంటాడింది. కారు ప్రమాదంలో మౌనిక చనిపోయింది. మరో ఐదు నిమిషాలైతే అందరూ ఇంట్లో ఉండేవాళ్లు. కానీ డ్రైవర్ నిద్రమత్తు రెండు కుటుంబాలను కన్నీటిసంద్రంలో ముంచేసింది.

ప్రకాశం జిల్లాలో జరిగిన ఇటీవల మరో ప్రమాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె- కలుజువ్వలపాడు మధ్యలో జరిగిందీ యాక్సిడెంట్. పొదిలి మండలంలోని అక్కచెరువు గ్రామంలో జరగాల్సిన పెళ్లికి.. బొలేరో వాహనంలో పెళ్లికుమార్తెను తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో జరిగిందీ ఘటన. బొలేరో డోరు విరిగిపడ్డంతో.. వాహనంలోని పెళ్లికుమార్తె బంధువులు జారి కిందపడ్డారు. వీరిలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా మరో ఇద్దరు మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు.  కాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన పెళ్లికూతురు.. సొంత బంధువులు కాటికెళ్లడంతో కన్నీరు మున్నీరుగా రోధించింది. హృదయ విదారక దృశ్యం.. అందర్నీ కంటతడి పెట్టించింది.

కారు డ్రైవర్లు కాస్త ఆలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉంటే ఈ కుటుంబాలు సంతోషంగా ఉండేవి. కొత్త జంటలతో కళకళలాడుతుండేవి. కానీ విధి మరోటి తలచింది. నిండు నిర్లక్ష్యం ఈ కుటుంబాలను కన్నీటిసంధ్రంలో ముంచేసింది.

Also Read:‘లింకులు తెంపుతాం.. నేరస్థులను పట్టుకుంటాం..’ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు

 హైఅలెర్ట్.. ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో అతి భారీ..