Telangana: డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా ఊహించని షాక్..
దూరం నుంచి చూస్తే.. ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే పొలం దున్నుతోంది. ఏదో వింత జరుగుతుందని గ్రామస్తులంతా ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వెళ్లారు. కానీ తీరా అక్కడికి వెళ్లి చూశాక కనిపించిన దృశ్యం చూసి అందరి గుండెలు పగిలాయి. డ్రైవర్ లేని ఆ ట్రాక్టర్ వెనుక ఒక రైతు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. కామారెడ్డి జిల్లా మిషన్‌పల్లి గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా విషాదం నింపింది.

కామారెడ్డి జిల్లాలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దానికదే పొలం దున్నింది. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం మిషన్‌పల్లిలో జరిగింది. గ్రామంలో యాసంగి నాట్లు ఊపందుకున్నాయి. బోండ్ల శ్రీను అనే రైతు పొలంలో ట్రాక్టర్ దానికదే దున్నుతోంది. డ్రైవర్ సీట్లో ఎవరూ లేకుండా చుట్టూ తిరుగుతోంది. అదేంటి ట్రాక్టర్ అలా దానికదే తిరుగుతోందని చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వారు చూసి ఆశ్చర్యపోయారు. కొందరు ఆ పొలం రైతు శ్రీనుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వెంటనే ట్రాక్టర్ దగ్గరకు వెళ్లి చూడగా గుండె పగిలే దృశ్యం కనిపంచింది.
పొలంలో కూడా ఎవరూ కనిపించడం లేదు.. రైతులకు అనుమానం వచ్చి మడి మొత్తం వెతికారు.. ఓ చోట రైతు శ్రీను మట్టిలో కూరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ఒక్కసారిగా అంతా షాక్.. ట్రాక్టర్‌తో దున్నుతున్న సమయంలో గుండె పోటు వచ్చి ట్రాక్టర్ పై నుంచి కింద పడిపోయి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కింద పడ్డాక ట్రాక్టర్ రైతు శ్రీను మీద నుంచి వెళ్లిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.. గుండె పోటు వచ్చిందా లేదా ఇంకేదైనా కారణంతో కింద పడినప్పుడు ట్రాక్టర్‌పై నుంచి వెళ్లి ఊపిరాడక చనిపోయాడా అనే విషయాలు తేలాల్సి ఉంది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
