Telangana: ఆ గ్రామాల్లో సంచరిస్తున్న పులి.. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ఫారెస్ట్ అధికారులు..
Telangana: మంచిర్యాల జిల్లాలో పులి సంచారం గుబులురేపుతోంది. వరుసగా పశువులపై దాడి చేసి హతమారుస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
Telangana: మంచిర్యాల జిల్లాలో పులి సంచారం గుబులురేపుతోంది. వరుసగా పశువులపై దాడి చేసి హతమారుస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అటవి ప్రాంతంలోని పంటపొలాల వైపు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా చెన్నూరు డివిజన్‌లోని కోటపల్లి రేంజీలో పులి సంచారిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించడంతో ఆ భయం మరింత రెట్టింపు అయ్యింది. పులి సంచార గ్రామాల్లో ఊరురా డప్పు చాటింపు వేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అటవిశాఖ అదికారులు. మహారాష్ట్ర నుండి కోటపల్లి పారెస్ట్ రేంజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పులిని కాపాడేందుకు అటవిశాఖ అదికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ సమీప గ్రామాలైన ఎడగట్ట, నాగంపేట్, వెంచపల్లి, బొప్పారంలో మహారాష్ట్ర నుండి వలస వచ్చిన పెద్దపులి సంచరిస్తోంది. వారం వ్యవధిలో వరసగా నాలుగు పశువులపై ఎటాక్ చేసి హతం చేసింది. వరుసగా పశువులపై పంజా విసురుతుండటంతో అలర్ట్ అయిన అటవిశాఖ అధికారులు, పారెస్ట్ సిబ్బంది పులి సంచార అటవి ప్రాంతంలోకి ప్రజలెవరు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో ఇదే రేంజ్ లో వలస వచ్చిన పులిని ఉచ్చులు పెట్టి వేటగాళ్లు హతం చేయడంతో మరోసారి అలాంటి దారుణం జరగకుండా ముందస్తుగా అలర్ట్ అవుతున్నారు అటవి అధికారులు. పులి సంచార గ్రామాలను అలర్ట్ చేయడంతో పాటు అటవి సమీపంలో విద్యుత్ సరపరా, కంచెలపై పోకస్ పెట్టారు.
ప్రాణహిత నది దాటి మహరాష్ట్ర నుండి వచ్చిన పులి లింగన్న పేట, ఎస్వాయి, వెంచపల్లి, బొప్పారం, ఎడగట్ట, నాగంపేట్, ఎదుల బందం ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా గుర్తించిన అటవిశాఖ అదికారులు.. ఈ ప్రాంతాలలో ఉచ్చులు పెట్టే వేటగాళ్లపై నిఘా పెట్టారు. ఇప్పటికే చెన్నూరు డివిజన్ ప్రాంతంలో రెండు పులులు సంచరిస్తుండగా.. తాజాగా వలస వచ్చిన పులితో కోటపల్లి రేంజ్ లో పులుల సంఖ్య మూడుకు చేరినట్టు తెలుస్తోంది. భారీ వర్షాలతో ప్రాణహిత, పెద్ద వాగు ఉగ్రరూపం దాలుస్తుండటం.. మహారాష్ట్ర నుండి ప్రాణహిత దాటొచ్చిన వలస పులి తిరిగి మహారాష్ట్ర వెళ్లే అవకాశం లేకపోవడంతో.. దాని ప్రయాణం ఎటు వైపు సాగుతుందో అని ఆందోళన చెందుతున్నారు పారెస్ట్ అదికారులు. గ్రామాలకు సమీపంలోకి వస్తుండటంతో పులి నుండి స్థానికులకు ఎలాంటి అపాయం జరగకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాయంత్రం ఆరు దాటితే అడవి బాట పట్టవద్దని.. పొలం పనులకు వెళుతున్న రైతులు, వ్యవసాయ కూలీలు గుంపులు గుంపుగా వెళ్లాలని సూచిస్తున్నారు. గత పులి దాడి ఘటనలతో అలాంటి పరిస్థితులు మరోసారి ఎక్కడ పునరావృతం అవుతుందో అని అటు అటవిశాఖ ఇటు స్థానిక ప్రజానికంలో భయం నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..