AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: వద్దన్నా సిట్టింగ్‌కే టికెట్‌.. బీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ.. గులాబీ కేడర్‌లో గుబులు..

ఇల్లందు బీఆర్‌ఎస్‌లో అసమ్మతి చల్లారడం లేదు. తాము వ్యతిరేకించినా సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్‌ ఇవ్వడంపై అసమ్మతి వర్గం భగ్గుమంటోంది. కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన హరిప్రియకి టికెట్ ఇవ్వొద్దని మున్సిపల్ చైర్మన్‌ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు పార్టీ పెద్దలపై చివరి దాకా ఒత్తిడి తెచ్చారు.

BRS: వద్దన్నా సిట్టింగ్‌కే టికెట్‌.. బీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ.. గులాబీ కేడర్‌లో గుబులు..
BRS MLA Seat
Ravi Kiran
|

Updated on: Sep 21, 2023 | 8:40 PM

Share

సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి వర్గం పట్టు. అయినా అధిష్ఠానం సిట్టింగ్‌కే టికెట్ ఇవ్వడంతో గుర్రుగా ఉన్నారు అసంతృప్త నేతలు. సహాయ నిరాకరణతో ఎమ్మెల్యేని ఒంటరిని చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇల్లందు బీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. ఈ పరిణామాలు గులాబీ కేడర్‌లో గుబులు పుట్టిస్తున్నాయి.

ఇల్లందు బీఆర్‌ఎస్‌లో అసమ్మతి చల్లారడం లేదు. తాము వ్యతిరేకించినా సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్‌ ఇవ్వడంపై అసమ్మతి వర్గం భగ్గుమంటోంది. కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన హరిప్రియకి టికెట్ ఇవ్వొద్దని మున్సిపల్ చైర్మన్‌ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు పార్టీ పెద్దలపై చివరి దాకా ఒత్తిడి తెచ్చారు. రహస్యభేటీలతో అసమ్మతి వర్గాన్ని ఏకం చేశారు. దీంతో ఓ దశలో హరిప్రియకి టికెట్‌ డౌటేనన్న ప్రచారం జరిగింది. కానీ చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ప్రకటించడంతో అసమ్మతి నేతలు రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే భర్త హరిసింగ్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే భర్త సొంత పార్టీ నేతలనే ఎన్నో ఇబ్బందులు పెట్టాడని, ఆయన వ్యవహారశైలితో ఇల్లందులో బీఆర్‌ఎస్‌కు నష్టం జరుగుతోందన్నది అసమ్మతి నేతల వాదన.

సిట్టింగ్‌లకు టికెట్లపై కొన్నిచోట్ల చెలరేగిన అసంతృప్తులు చల్లారినా ఇల్లందులో వేడి మరింత పెరుగుతోంది. టికెట్ల ప్రకటన తర్వాత నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది బీఆర్‌ఎస్‌ నాయకత్వం. ఇల్లందు బాధ్యతలను పార్టీ ఎంపీ వద్దిరాజు రవికి అప్పగించారు. వారం క్రితం ఎంపీ ఇల్లందులో భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే పార్టీ ర్యాలీకి, సభకు అసమ్మతి నేతలు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే భర్త, మున్సిపల్‌ చైర్మన్‌ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారట ఎంపీ వద్దిరాజు రవి. అయితే రాజీ ప్రయత్నాల్లోనూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనీ.. పరస్పరం విమర్శలు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కలిసి పని చేసేది లేదని తేల్చిచెప్పేశారట ఇల్లందు మున్సిపల్ చైర్మన్.

ఇల్లందు బీఆర్‌ఎస్‌లో అసమ్మతి ఇప్పటిది కాదు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ వర్గాల మధ్య ఎప్పట్నించో వివాదం నడుస్తోంది. ఇల్లందు మున్సిపాలిటీలో తనకు వ్యతిరేకంగా కొందరు కౌన్సిలర్లను ఎమ్మెల్యే భర్త హరిసింగ్ చేరదీశాడని మున్సిపల్‌ చైర్మన్‌ అనుమానిస్తున్నారు. సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారని, మళ్లీ హరిప్రియకే టికెట్‌ ఇవ్వడం పార్టీకి తీవ్ర నష్టమేనంటోంది మున్సిపల్‌చైర్మన్‌ వర్గం. పార్టీని కాపాడుకునేందుకే సిట్టింగ్‌కి టికెట్‌ వద్దని తాము ఎంతచెప్పినా ఆమెకే అవకాశం ఇచ్చారంటోంది. రెండువర్గాల మధ్య పార్టీ ముఖ్యనేతలు ఎన్నిసార్లు పంచాయితీలు పెట్టినా సీన్‌ మారడంలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇల్లందులో పార్టీ నేతల మధ్య సమన్వయం ఇంచార్జికి సవాలుగా మారింది. కీలక సమయంలో ఇల్లందులో ఇంటిపోరు చివరికి కొంపముంచేలా ఉందని టెన్షన్‌ పడుతోంది గులాబీ కేడర్‌.