Rythu Bandhu funds: ఈసీ సంచలన నిర్ణయం.. రైతుబంధుకు బ్రేక్..
రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసిన ఈసీ. గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన ఎన్నికల కమిషన్. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. నిన్నటి ఎన్నికల ప్రచార సభలో ఈనెల 28న రైతుబంధు నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. రేపటితో ప్రచారం ముగియనుండగా.. పోలింగ్ కు కౌంట్ డౌన్ షురూ కానుంది. దీంతో ప్రధాన పార్టీలు.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలనే రైతు బంధు నగదు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం.. గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఇచ్చిన ‘నో అబ్జెక్షన్’ను ఉపసంహరించుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. రైతుబంధుకు ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. రైతుబంధు నిధులు విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈసీ రెండు పేజీల లేఖను తెలంగాణ సీఈఓకు పంపింది.
రైతుబంధుపై ఈసీకి ఫిర్యాదులు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రైతుబంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. BRS నేతలు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ ఈసీ తన లేఖలో పాల్గొంది. ఇటీవల మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలోనే EC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 28న రైతుబంధు నిధులు విడుదల చేస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ ప్రకటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. హరీశ్ రావు ప్రకటన మిగతా రాజకీయ పార్టీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అందుకే గతంలో ఇచ్చిన ‘నో అబ్జెక్షన్’ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
ఎన్నికల నోటిఫికేషన్ నాటినుంచి రైతుబంధు చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి.. నిధుల విడుదలకు విపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. ఎన్నికల సంఘం రైతు బంధు నిధులు విడుదల చేయడానికి అనుమతినిచ్చింది.. ఈ క్రమంలోనే అనుమతిని రద్దు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




