Telangana Elections: ఓట్ల జాతరలో నోట్ల వర్షం.. ఇవి దేశంలోనే చాలా కాస్ట్‌లీ ఎన్నికలు గురూ..! 20 వేల కోట్లకు పైగానే..
ప్రజాస్వామ్యపు అతి పెద్ద పండుగ...నోట్ల జాతరగా మారిపోయింది. ఓట్ల పండుగ కోట్ల రూపాయల చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ ఎన్నికలు...భారతదేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయా? ఎన్నికల మార్కెట్‌లో ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. ప్రతి ఓటుకు ఓ రేటు ఉంటుంది. ఎన్నికల మార్కెట్‌లో ఓటర్లకు మాత్రమే కాదు..ఛోటామోటా లీడర్లకూ ఓ రేటు పలుకుతుంది. ఇప్పటికే చేరాల్సిన చోట్లకు డబ్బు చేరిపోయిందా? మొత్తం ఎన్ని వేల కోట్లు పంపిణీ చేస్తున్నారు. అసలు ఈ ఓటుకు కోట్లు నెట్ వర్క్ ఎలా పనిచేస్తుంది? ఫైనల్‌గా ఓటర్‌కు డబ్బు ఎలా చేరుతుంది?
తెలంగాణ అనేక అంశాల్లో దేశానికే తలమానికంగా నిలిచింది. చాలా రంగాల్లో నెంబర్ వన్‌గా ఎదిగింది. ఇప్పుడు ఎన్నికల ఖర్చు విషయంలో కూడా తెలంగాణ.. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అయిందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ దంగల్‌లో ధన ప్రవాహమే దీనికి సాక్ష్యం అంటున్నారు వాళ్లు. ఎన్నికల చివరి చరణంలో.. పోలింగ్ డేట్ దగ్గర పడేకొద్దీ.. తాయిలాల హీట్ మరింత పెరుగుతోంది. అసలు పంపిణీ ఇప్పుడే ప్రారంభమవుతోందంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో 700 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టారని చెబుతారు. ఆ తర్వాత వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో కూడా 600 కోట్ల దాకా అభ్యర్థులు ఖర్చు పెట్టారంటారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్ల రూపాయల గురించి ఏకంగా దేశమే మాట్లాడుకుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదయిన ఎన్నికలుగా రికార్డు సృష్టించబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఈసారి 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని చెబుతున్నారు. అసలు తెలంగాణలో ఎన్నికలు ఇంత కాస్ట్‌లీగా ఎందుకు మారాయి అంటే.. దానికి ఉప ఎన్నికలే కారణమంటున్నారు విశ్లేషకులు. ఉప ఎన్నికలో గెలిచిన అభ్యర్థి..తర్వాత ఎన్నికల్లో కూడా గెలుస్తాడనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందని నేతలు భావిస్తున్నారు. దీంతో ఉప ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు విపరీతంగా ఖర్చు పెడతారు. ఇక మరోవైపు ఉప ఎన్నికల్లో… ఒక్కో ఓటర్‌కు వేల రూపాయల్లో డబ్బు ఎర వేయడంతో.. తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే డబ్బు ఇస్తారని జనం ఆశించడం, ఎన్నికల ఖర్చు పెరగడానికి మరో కారణం అంటున్నారు. దీంతో డబ్బులు ఇవ్వకపోయినా, తక్కువ ఇచ్చినా.. ధర్నాలు చేసే స్థాయికి జనం వెళ్లారని అనలిస్టులు చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఇప్పటివరకు పోలీసులకు పట్టుబడ్డ నగదు, నగల విలువ 709 కోట్ల రూపాయలకు పైమాటే! ఇందులో 290 కోట్ల రూపాయల వరకు నగదు రూపంలోనే పట్టుబడింది. అనధికారికంగా ఇంకెంత ధనం ప్రవహించిందో చెప్పడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన డేటా ప్రకారం..పట్టుబడ్డ సొమ్ములో బంగారం, వెండి ఆభరణాల విలువ 186 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. ఇక మద్యం, మత్తు పదార్థాలయితే..దాదాపు 38 కోట్ల రూపాయల విలువ ఉంటాయి. అయితే ఎన్నికల్లో పార్టీలు ఖర్చు చేస్తున్న వేల కోట్లతో పోలిస్తే ఇవి నామ మాత్రమే అంటున్నారు విశ్లేసకులు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఓటర్లను కొనుగోలు చేయడానికి కావాల్సిన నగదు ఇప్పటికే గమ్యస్థానాలకు చేరిందని నిపుణులు చెబుతున్నారు. ఈ డబ్బును తరలించడానికి రకరకాల నెట్‌వర్కులను రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న బడా వ్యాపారవేత్తలు, రియల్టర్ల ద్వారా డబ్బును అక్రమంగా ఆల్రెడీ తరలించేశారు. గ్రామస్థాయిలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీటీసీలు, జిల్లా స్థాయిలో జడ్పిటిసిలు ఈ డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ల ద్వారానే ఈ డబ్బు ఓటర్లకు చేరుతుంది. ఇక ఎన్నికల మార్కెట్‌లో ఓటర్లను మాత్రమే కాదు…ఛోటామోటా లీడర్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. పొలిటికల్ బజార్‌లో సర్పంచుకు 5 నుంచి 8 లక్షల రూపాయల దాకా రేటు పలుకుతోంది. స్థానికంగా వాళ్లకున్న బలాన్ని బట్టి ఈ రేటు మారుతుంది. ఒక లెక్క ప్రకారం.. కేవలం ఓటర్లను కొనుగోలు చేయడానికి మాత్రమే.. ఈసారి 10 వేల కోట్ల రూపాయల దాకా మన నేతాశ్రీలు ఖర్చు పెడుతున్నారని చెబుతున్నారు. ఈ పది వేల కోట్లకు ప్రచార ఖర్చులు అదనం. ఇక ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి తమ స్థోమతను బట్టి 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. 28వ తేదీ సాయంత్రం నుంచి.. పోలింగ్ జరిగే 30వ తేదీ ఉదయం వరకు ఓటర్లకు డబ్బు పంపిణీ జరుగుతుంది. ఈ దుస్థితికి నాయకులతో పాటు ఓటర్లు కూడా కారణమే అంటున్నారు విశ్లేషకులు. ఇక ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సిన ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలం అయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఓటు అమ్ముకుంటే.. బానిసగా మారిపోయినట్లే అంటున్నారు ఓటర్లు. ఓట్లు కొనుక్కోవడం..గెలిచాక అవినీతికి పాల్పడడం, ఇదంతా వ్యాపారంలా మారిపోయిందంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ఎంత తగ్గించగలిగితే..సమాజానికి అంత మేలు జరుగుతుందంటున్నారు సామాజికవేత్తలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..