Telangana: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు షురూ..
టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణతో కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది. కొత్తగా 65 ఈవీ బస్సులను మంత్రి పొన్నం జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 810 ఈవీ బస్సులతో పర్యావరణ పరిరక్షణలో టీజీఆర్టీసీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. భద్రత, ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ బస్సులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాయి.

తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాణిగంజ్ డిపోలో 65 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సుల ప్రారంభోత్సవంతో పాటు హైదరాబాద్ నగరంలో కొత్తగా 373 కాలనీ రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆర్టీసీ మొత్తం రాష్ట్రంలో 810 ఈవీ బస్సులను నడుపుతోంది. వీటిలో 300 బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో తిరుగుతున్నాయి. ఇవాళ 65 బస్సుల ప్రవేశంతో పాటు జనవరి చివరి నాటికి మరో 175 EV బస్సులు అందనున్నాయి. దీంతో నగరంలో మొత్తం 540 EV బస్సులు అందుబాటులోకి వస్తాయి.
కొత్తగా ఈవీ బస్సులు నడిచే రూట్లు
- సికింద్రాబాద్ – కొండాపూర్: 14 బస్సులు
- సికింద్రాబాద్ – ఇస్నాపూర్: 25 బస్సులు
- సికింద్రాబాద్ – బోరబండ: 8 బస్సులు
- సికింద్రాబాద్ – రామాయంపేట: 6 బస్సులు
- సికింద్రాబాద్ – గచ్చిబౌలి: 8 బస్సులు
- సికింద్రాబాద్ – మీడియాపూర్ ఎక్స్ రోడ్డు: 4 బస్సులు
పర్యావరణం – ప్రయాణికుల భద్రత
EV బస్సుల ప్రవేశపెట్టడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ నిర్వహణ, కార్యాచరణ సామర్థ్యం, ఆధునిక ప్రజా రవాణాలో కార్పొరేషన్ ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ట్రాకింగ్, విశాలమైన సీటింగ్, మెరుగైన యాక్సెసిబిలిటీ ఫీచర్లతో ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించనున్నాయి. ఈ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ ప్రజలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయో స్థానిక ఆర్టీసీ అధికారులకు తెలియజేయాలని మంత్రి పొన్నం సూచించారు. ఐటీ కారిడార్‌లో ఐటీ ఉద్యోగులకు అవసరమైన బస్సులు నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఉద్యోగులు సొంత వాహనాలు, క్యాబ్‌లకు దూరంగా ఉండడం వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని తెలిపారు. రాజధాని నుండి గ్రామాల వరకు ఆర్టీసీ మరింత విస్తరిస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని ,ఉద్యోగ నియామకాలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఉచిత ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటివరకు 251 కోట్ల ఫ్రీ బస్సు జర్నీలు నమోదయ్యాయని.. దీని విలువ రూ.8,500 కోట్లు అని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




