క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ కలకలం..100 మందికి అనారోగ్యం.. ఎలా వ్యాపిస్తుందంటే..?
ఒక క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ వ్యాప్తి చెంది.. 100 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఏడాది క్రూయిజ్ షిప్‌లలో ఇది 21వ సంఘటన అని CDC తెలిపింది. వాంతులు, విరేచనాలు ప్రధాన లక్షణాలు. కొత్త రకం నోరోవైరస్ వ్యాప్తి దీనికి కారణం కావచ్చు.

విహారయాత్రకు వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురైంది. ఒక క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ వ్యాప్తి చెందడం వల్ల 100 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఏడాది క్రూయిజ్ షిప్‌లలో ఇలాంటి జీర్ణశయాంతర వ్యాధి వ్యాప్తి చెందడం ఇది 21వ సారి అని అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ఈ భారీ షిప్ జర్మనీలోని హాంబర్గ్ నుంచి ఉత్తర అమెరికా వైపు వెళుతోంది. ప్రస్తుతం 2 వేల మంది ప్రయాణికులలో 95 మంది, 640 మంది సిబ్బందిలో 6 మంది అనారోగ్యానికి గురయ్యారు. డిసెంబర్ 16 వరకు కొనసాగే ఈ ప్రయాణంలో బాధితులు విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఈ షిప్ ప్రస్తుతం కోస్టా రికా దగ్గర ఉంది.
ఎందుకు ఇలా జరుగుతోంది?
సీడీసీ అధికారుల ప్రకారం.. ఈ ఏడాది క్రూయిజ్ షిప్‌లలో నోరోవైరస్ కేసులు పెరిగాయి. దీనికి కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొత్త రకం నోరోవైరస్ జాతి వ్యాపిస్తోంది. సాధారణంగా ఓడల్లోని వ్యాధుల నమూనా భూమిపై జరిగే వ్యాప్తి నమూనానే అనుసరిస్తుంది. క్రూయిజ్ నిర్వహకులు వెంటనే అనారోగ్యానికి గురైన వారిని క్వారంటైన్ చేసి.. షిప్ మొత్తం శానిటైజ్ చేశారు. ఈ చర్యల వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయని సంస్థ తెలిపింది.
నోరో వైరస్ అంటే..?
ఇది వాంతులు, విరేచనాలు, ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలకు ప్రధాన కారణం. దీని వల్ల కడుపు లేదా పేగులు వాపు వస్తాయి. ఎక్కువ మంది 1 నుంచి 3 రోజుల్లో కోలుకుంటారు. ఇది గాలి ద్వారా లేదా కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఆహారాన్ని పూర్తిగా ఉడికించడం, తరచుగా ఉపరితలాలను శుభ్రం చేయడం చాలా అవసరం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




