AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీకి భారీగా పెరిగిన ఆదాయం.. ఒకేరోజులోనే 51.74 లక్షల మంది ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రేవంత్‌ సర్కార్‌ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలులోకి తీసుకొచ్చారు. దీంతో డిసెంబర్ 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది. మహిళలకు పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు..

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీకి భారీగా పెరిగిన ఆదాయం.. ఒకేరోజులోనే 51.74 లక్షల మంది ప్రయాణం
TSRTC Free Bus Travel For Women
Srilakshmi C
|

Updated on: Dec 20, 2023 | 8:57 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రేవంత్‌ సర్కార్‌ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలులోకి తీసుకొచ్చారు. దీంతో డిసెంబర్ 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది. మహిళలకు పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. నిలబడటానికి చోటులేనంతగా బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పథకం ప్రారంభమైన తర్వాత సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా 51.74 లక్షల మంది ప్రయాణాలు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. బస్‌ పాసులను మినహాయిస్తే.. దాదాపు 48.5 లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ టికెట్‌ జారీ చేసింది.

మొత్తం ప్రయాణికుల్లో 30.16 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికుల్లో మహిళలు కేవలం 40 శాతం మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ కింద ఆర్టీసీ నిధులు చేరతాయన్న విషయం తెలిసిందే. దీంతో బస్సు ప్రయాణికుల సంఖ్య పెరగడంతో సోమవారం ఒక్కరోజులోనే ఆర్టీసీకి రూ.21.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఆర్టీసీ జోన్లలో సోమవారం బస్సులు 33.36 లక్షల కిలోమీటర్లు తిరిగాయి.

అత్యధికంగా కరీంనగర్‌ జోన్‌లో 14.49 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 10.93 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. డిసెంబరులో ఇప్పటి వరకు డిసెంబర్ 4వ తేదీన అత్యధికంగా 34.16 లక్షల కి.మీ. బస్సులు తిరగగా రూ.21.04 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ 18న 33.36 లక్షల కిలోమీటర్లు మాత్రమే బస్సులు తిరిగినా రూ.21.10 కోట్ల ఆదాయం వచ్చింది. బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 97.31 శాతానికి పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.