School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజుల సెలవులు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు వరంగల్, నల్గొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. దీంతో పలు జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు.

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు వరంగల్, నల్గొండ జిల్లాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది. మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 72గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారుల సెలవులు రద్దు చేశారు. ఇదే సమయంలో విద్యాశాఖ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. మహబూబ్‌నగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఈ 5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
ఈ సెలవులతో ఈ 5 జిల్లాల్లో స్కూళ్లకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఎందుకంటే 13, 14 వర్షాల ఎఫెక్ట్‌తో సెలవులు ఇచ్చారు. 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న ఆదివారం.. ఇలా 5రోజుల సెలువులు వచ్చాయి. ఇక హైదరాబాద్ పరిధిలో మాత్రం అధికారులు హాఫ్ డే సెలవు ఇచ్చారు. దీంతో మధ్యాహ్నాం వరకు స్కూళ్లు తెరుచుకోనున్నాయి. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు ఎట్టిపరిస్థితుల్లో తెరవకూడదని.. ఒకవేళ తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లోనూ స్కూళ్లకు ఫుల్ డే హాలిడే ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రస్తుతానికి హాఫ్ డే వరకు సెలవులు ఇచ్చిన అధికారులు.. పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.
జీహెచ్ఎంసీ అలర్ట్
రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమురంభీం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలో 269 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని తెలిపారు. జలమండలి, వాటర్ బోర్డు, హైడ్రా, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
