Telangana Politics: వ్యూహం మారింది.. గేరు మార్చింది.. వారి విషయంలో బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..
ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో కారు పార్టీ గేర్ మారుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో.. సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోన్న బీఆర్ఎస్.. ఇప్పుడు ప్లాన్-Cతో ప్రజల్లోనూ తేల్చుకునేందుకు సిద్ధమైంది. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో వ్యూహం మార్చి.. వాళ్ల వాళ్ల నియోజకవర్గా్ల్లోనే సభలు స్టార్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది.

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను వదిలిపెట్టేదే లేదంటోంది బీఆర్ఎస్. అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చి.. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటివరకు అసెంబ్లీ వేదికగా కొట్లాడడం.. సుప్రీంకోర్టులో న్యాయం పోరాటం చేయడం ద్వారా ప్లాన్-A, ప్లాన్-Bని అమలు చేసింది. ఇప్పుడు.. నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా అన్నట్లు.. ప్లాన్-Cతో.. ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే తాడోపేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే.. ముందుగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల గడ్డ నుంచి గర్జన స్టార్ట్ చేసింది. గద్వాల గర్జన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మార్పుపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు కేటీఆర్. అయితే.. ఈ లోపే 10మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఎవరి సత్తా ఏంటో తేల్చుకునేందుకు సిద్ధమా అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
ఇక.. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న కేటీఆర్ కామెంట్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌కు సవాల్ విసిరే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
మొత్తంగా.. తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో బీఆర్‌ఎస్ అసెంబ్లీలో, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూనే.. ఇప్పుడు ప్లాన్-C వ్యూహాన్ని స్టార్ట్ చేయడం మరింత ఆసక్తి రేపుతోంది. అయితే.. ఫిరాయింపుల విషయంలో ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్లాలంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగిన కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ ప్లాన్-C వ్యూహంపై ఎలా ముందుకెళ్తుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
