Congress vs Bjp: కాంగ్రెస్ నేతల జపం చేస్తోన్న కమలం నేతలు.. అసలు వ్యూహం ఇదేనా?..
Congress vs Bjp: కమలం.. కాంగ్రెస్ నేతల జపం చేస్తోంది. నిన్న అమిత్‌షా.. పీవీకి శ్రద్దాంజలి ఘటిస్తే. ఇవాళ బండి సంజయ్ పీజేఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Congress vs Bjp: కమలం.. కాంగ్రెస్ నేతల జపం చేస్తోంది. నిన్న అమిత్‌షా.. పీవీకి శ్రద్దాంజలి ఘటిస్తే. ఇవాళ బండి సంజయ్ పీజేఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయనో గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా బీజేపీ నేతలు.. ఎందుకిలా స్వరం మార్చారు? ప్రశంసల వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అగ్రనేతల టూర్‌తో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎదురులేని పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ గత రెండు దఫాలుగా పాలన సాగిస్తోంది. అయితే ఆ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని నిన్న తుక్కుగూడ సభలో తూర్పార బట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మజ్లీస్‌కు భయపడే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విమర్శించారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసిన సర్దార్ పటేల్‌ను కీర్తించిన షా.. అందుకు కృషి చేసిన వారిని గుర్తు చేసుకున్నారాయన. ఇదే సమయంలో చాలా వ్యూహాత్మకంగా పీవీ పేరును ప్రస్తావించారు అమిత్ షా.
మరోవైపు ఇవాళ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. పీజేఆర్ గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. అమిత్ షా, బండి సంజయ్ ఇద్దరు పొగిడింది ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన వాళ్లనే. వాళ్ల పేర్లను తెరపైకి తీసుకురావడం.. ప్రశంసల వర్షం కురిపించడం తెలంగాణ గట్టుమీద హాట్ టాపిక్‌గా మారింది. హస్తం అంటేనే అంతెత్తున లేచే బీజేపీ.. ఆ పార్టీ నేతలను ఓన్ చేసుకోవడం దేనికి సంకేతం? కాంగ్రెస్ ఖేల్ ఖతం చేసే ప్రొగ్రామ్ కమలం పెట్టుకుందా అన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ ఘనాపాటీలను ఓన్ చేసుకోవడం ద్వారా వారి వారసత్వాన్ని తమవైపు లాక్కోవడంతో పాటు.. మిగతా బలమైన నేతలను ఆకర్షించడం స్ట్రాటజీగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.