Bjp vs Trs – Telangana: అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్.. పాయింట్ టు పాయింట్ వివరణతో ఎన్‌కౌంటర్..!
KTR Counter to BJP: కేంద్ర మంత్రి అమిత్ షా పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తుక్కుగూడ బీజేపీ సభలో ఆయన చేప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని,,
KTR Counter to BJP: కేంద్ర మంత్రి అమిత్ షా పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తుక్కుగూడ బీజేపీ సభలో ఆయన చేప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి.. ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతారా? అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణకు ఏం ఇచ్చారో నిజం చెప్పమంటే.. నిజాం గురించి చెప్పి వెళ్లారని విమర్శించారు. నిజాం గురించి వారి వారసులు కూడా అంతలా తలుచుకుంటారో లేదో తెలియదు గానీ.. ఈ బీజేపీ నేతలు మాత్రం నిద్రలో కూడా కలవరిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఏ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారనేది మర్చిపోయారని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభలో అమిత్ షా చేసిన కామెంట్స్‌కి ఊహించని స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చారు. సభలో అమిత్ షా మాట్లాడిన ప్రతీ అంశానికి పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలను ఓ రేంజ్‌లో తూర్పారబట్టారు. తెలంగాణ అప్పులు, అభివృద్ధి, నిధులు, నియామకాలు ఇలా ప్రతీ అంశాన్ని వివరణ ఇస్తూ.. అదే సమయంలో కేంద్రం పనితీరుపైనా ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘గత కొద్ది రోజులుగా తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారు. ఒక్కో టూరిస్టు వచ్చి ఇష్టమొచ్చినట్లు, నోటికి ఏది వస్తే అది మాట్లాడి వెళ్తున్నారు. వచ్చిన ప్రతీఒక్కరూ ఎయిర్‌పోర్టుల్లోనూ, పార్టీ కార్యాలయాల్లోనూ బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నాయకత్వం రాసిచ్చిన స్క్రిప్టు చదువుతువున్నారు. అయితే, వారికి ఇక్కడ ఏం జరుగుతుంది? అనేది తెలియదు. ఆ స్క్రిప్టులో సత్యం ఉందా? అసత్యం ఉందా? అనే విషయం కూడా తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతున్నారు.’’ అని కాంగ్రెస్, బీజేపీ నేతలపై మండిపడ్డారు.
‘‘మొన్న రాహుల్ గాంధీ వచ్చి వెళితే.. నిన్న అమిత్ షా వచ్చారు. ఆయన మట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలే. అందుకే అమిత్ షా తన పేరును అబద్ధాల బాద్ షా అని మార్చుకోవాలి. తుక్కుగూడలో చెప్పినవన్నీ తుక్కు మాటలే. ఆయన చెప్పిన తప్పుడు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కేంద్ర మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉన్న అమిత్ షా.. ఇలా పచ్చి అబద్ధాలు చెప్పడం ఏమాత్రం సరికాదు. వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే విషయాలను వాస్తవాలుగా చిత్రీకరించరే ప్రయత్నం చేశారు.’’ అని విమర్శించారు.
ఆ ప్రశ్నలకు సమాధానం ఏది? తెలంగాణలో అడుగుపెట్టే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మేం డిమాండ్ చేశాం. 8 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నాం. 27 ప్రశ్నలకు అమిత్ షా కు వేశాం. దానికి కనీస స్పందన లేదు. నిజాలు చెప్పమంటే.. నిజాం గురించి మాట్లాడుతున్నారు. నిజాం వారసులు కూడా ఆయనను అంతలా తలుచుకుంటారో లేదో తెలియదు కానీ, బీజేపీ నాయకులు మాత్రం నిద్రలోనూ కలవరిస్తుంటారు. తెలంగాణకు ఏం చేశారంటే ఒక్క ప్రశ్నకు కూడా బదులివ్వకుండా హిందూ, ముస్లిం, నిజాం అంటూ సొల్లు కబుర్లు చెప్పారు.
మీది అవినీతి ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వం మరోటి లేదంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి పదవిని రూ.2,500 కోట్లకు అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారని కేటీఆర్ ఉదహరించారు. పదువులు అమ్ముకునే చిల్లర పార్టీ అని దుయ్యబట్టారు. అంతేకాదు.. హిందూ మఠాల వద్ద నుంచి కమీషన్లు తీసుకునే పార్టీ బీజేపీ అని ఆరోపించారు. కర్ణాటకలో మంత్రి వేధింపులు తాళలేక ఓ కాంట్రాక్టర్ చనిపోయిన విషయాన్ని మంత్రి కేటీర్ ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాల అవినీతి అంతా ఇంతా కాదని అన్నారు.
100 లక్షల కోట్ల అప్పులు ఎవరి కోసం.. తెలంగాణను అప్పులపాలు చేశారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు మంత్రి కేటీఆర్. దేశాన్ని అప్పులపాలు చేసిందే బీజేపీ సర్కార్ అని కౌంటర్ అటాక్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 65 ఏళ్లలో గత ప్రభుత్వాలన్నీ 55 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. మోదీ ప్రభుత్వం మాత్రం కేవలం 8 ఏళ్లలోనే రూ.100 లక్షల కోట్లు అప్పులు చేసి.. దేశాన్ని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. అయితే, ఈ వంద లక్షల కోట్ల అప్పులు ఎవరి కోసం చేశారని కేంద్రాన్ని నిలదీశారు మంత్రి కేటీఆర్. ‘‘పెట్రోల్, డిజీల్ పై ఇప్పటి వరకు రూ. 26 లక్షల కోట్లు వసూలు చేశారు, బడా బాబులకు సంబంధించిన రూ. 11.68 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు.’’ ఇది మీ బతుకు అంటూ ఘాటైన పదజాలంతో కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఒక అసమర్థ ప్రధాని వల్ల దేశానికి ఒరిగింది ఇది మాత్రమే అన్నారు. కార్పొరేట్ శక్తుల అప్పులు మాఫీ చేసి.. పేదల తోలు వలుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసినా.. అభివృద్ధి కోసమే చేసిందన్నారు. మరి రూ.100 లక్షల కోట్ల అప్పులు ఎవరి కోసం చేశారు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. దేశంలోని 28 రాష్ట్రాల్లో అప్పుల నిష్పత్తిలో తెలంగాణ స్థానం 23వ స్థానం అని వివరించారు. అధికంగా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయని కేటీఆర్ లెక్కలతో సహా వివరించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులతో మిషన్ భగీరథ చేపట్టాం, విద్యుత్ వ్యవస్థను స్థిరీకరించాం. కాళ్లేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతుల బాధను తీర్చాం. మరి మీరు ఎవరి కోసం అప్పులు చేశారు?’’ కేంద్రాన్ని ప్రశ్నించారు కేటీఆర్.
ఒక్కొక్కరు ఒక్కోరకంగా.. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారని విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఆర్థిక శాఖ గణాంకాలను తీసుకుని కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు వచ్చాయో చెబితే.. దానిని వక్రీకరించేందుకు బీజేపీ నేతలు ఆపసోపాలు పడ్డారని దుయ్యబట్టారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది రూ.3,65,797 లక్షల కోట్లు అయితే.. కేంద్రం నుంచి తిరిగి వచ్చింది మాత్రం రూ. లక్షా 68 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం, ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను మాత్రమే ఇస్తోంది తప్ప.. ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. కానీ, ఈ లెక్కలన్నింటినీ మసిపూసిమాయ చేసేందుకు బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారని దుయ్యబట్టారు. ‘‘మే 5వ తేదీన బీజేపీ ఎంపీ అరవింద్.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రూ.3,65,797 కోట్ల కంటే.. 24వేల కోట్లు అదనంగా ఇచ్చారని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేమో.. రూ.2,52,202 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఇక బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి.. రూ.4,11,018 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు. ఎవరి మాట నమ్మాలి. ముగ్గురు మూడు రకాలుగా చెప్పారు. వీళ్లది అబద్ధాల బతుకు, వీరి పార్టీకి ఒక విధానం ఏదీ లేదు. నోటికొచ్చినట్లు మాట్లాడటం, సంస్కారం లేకుండా మాట్లాడం తప్ప వీరికేం తెలియదు.’’ అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్.
ముందస్తు ఎన్నికలపై సవాల్.. ముందస్తు ఎన్నికలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదంటూ.. ప్రధాని నరేంద్ర మోదీకి డైరెక్ట్ సవాల్ విసిరారు. ముందస్తుకు పోవాల్సిన కర్మ తమకేమీ లేదని, బీజేపీ నేతలకు దమ్ము, ఉబలాటం ఉంటే పార్లమెంట్‌ను రద్దు చేసుకుని రావాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే రావాలని, తమ సత్తా ఏంటో చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇదే సమయంలో తమ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ చేసిన కామెంట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ‘మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది. మీ స్టీరింగే కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లింది. మీ స్టీరింగ్ ఎవరు నడుపుతున్నారో ప్రజలందరికీ తెలుసు. రాజ్యంగ బద్ధమైన సంస్థను చేతిలో పెట్టుకుని, ఏజెన్సీలను అడ్డం పెట్టుకుని ఆటలు సాగిస్తున్నారు. మీ ఆటలు ఎక్కువ కాలం సాగవు. అబద్ధాలు చెప్పి ఎక్కువ కాలం బతకలేరు.’ అని ధీటుగా జవాబిచ్చారు మంత్రి కేటీఆర్.
ఇప్పుడే ఉచిత విద్య, వైద్యం ఇవ్వొచ్చు కదా?.. ‘‘బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత వైద్యం, విద్య ఇస్తామని చెప్తున్నారు.. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా? ఇంకెందుకు ఆలస్యం.. రేపు ఉచిత విద్య, వైద్యం అమలు చేయండి. మేం కూడా ఆ బిల్లుకు మద్ధతిస్తాం. బీజేపీ నాయకులకు ఘనంగా సన్మానం చేస్తాం. ముఖ్యంగా బండి సంజయ్‌కు తంబాకు, లవంగాలు పెట్టి సన్మానం చేస్తాం.’’ అని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్.