- Telugu News Telangana Telangana municipal corporations and municipalities new mayors chairmen and newly elected councils take oath
Telangana Municipalities: తెలంగాణ పురపోరులో మహిళలకే పట్టం.. కొలువుదీరిన కొత్త మేయర్లు, చైర్మన్లు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి.
Updated on: May 07, 2021 | 8:16 PM

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ ప్రమాణస్వీకారం చేశారు. గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి గెలుపొందగా, రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి గెలుపొందారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, టీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రో ప్రమాణస్వీకారం చేశారు. పునుకొల్లు నీరజ 26వ డివిజన్ నుంచి గెలుపొందగా, ఫాతిమా జోహ్రా 37వ డివిజన్ నుంచి గెలుపొందారు. ఖమ్మం మున్పిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 స్థానాలకు టీఆర్ఎస్ 45 డివిజన్లలో, కాంగ్రెస్ 10, ఇతరులు 5 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ ఒక డివిజన్‌లో మాత్రమే గెలిచింది.

సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్‌గా కనకరాజు ప్రమాణస్వీకారం చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులకు గానూ టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. టీఆర్ఎస్ రెబల్స్ అందరూ మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎడ్ల నర్సింహ గౌడ్, వైస్ చైర్మన్‌గా శైలజా విష్ణువర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎడ్ల నర్సింహ గౌడ్ 16వ వార్డు, శైలజ 19వ వార్డు నుంచి గెలుపొందారు. అచ్చంపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గానూ టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ ఒక వార్డులో గెలిచారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీ రవీందర్, వైస్ చైర్‌పర్సన్‌గా సారికా రామ్మోహన్ ప్రమాణస్వీకారం చేశారు. లక్ష్మీ రవీందర్ 8వ వార్డు, సారికా 15వ వార్డు నుంచి గెలుపొందారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులు ఉండగా, టీఆర్ఎస్ 23, బీజేపీ రెండు, కాంగ్రెస్ రెండు వార్డుల్లో గెలిచింది.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బాతుక లావణ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా డోలీ రవీందర్ ప్రమాణస్వీకారం చేశారు. లావణ్య యాదవ్, డోలీ రవీందర్ 8, 12వ వార్డుల నుంచి గెలుపొందారు. కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు గానూ, టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలిచింది.

నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్‌గా రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్‌పర్సన్‌గా శెట్టి ఉమారాణి ప్రమాణస్వీకారం చేశారు. రాచకొండ శ్రీనివాస్ 19వ వార్డు, శెట్టి ఉమారాణి 11వ వార్డు నుంచి గెలుపొందారు. నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, 11 వార్డుల్లో టీఆర్ఎస్, రెండు వార్డుల్లో కాంగ్రెస్, ఇతరులు ఏడు వార్డుల్లో గెలుపొందారు.
