Minister Srinivas Goud: ఏపీ సర్కార్ తీరుపై ఫైర్ అయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. మా ప్లాన్ మాకుందంటూ వార్నింగ్..

Minister Srinivas Goud: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు...

Minister Srinivas Goud: ఏపీ సర్కార్ తీరుపై ఫైర్ అయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. మా ప్లాన్ మాకుందంటూ వార్నింగ్..
Shiva Prajapati

|

Jun 21, 2021 | 7:26 PM

Minister Srinivas Goud: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన్న ఆయన.. ఏపీలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా జల దోపిడీని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. సోమవారం నాడు టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ కి విరుగుడుగా సీఎం కేసీఆర్ పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని చెప్పుకొచ్చారు. తెలుగు గంగకు మానవతా దృక్పథంతో మంచి నీళ్ల కోసం సహకరిస్తే అది జల దోపిడీ గా మారిందని మంత్రి ఉటంకించారు. పోతిరెడ్డి పాడు సామర్ధ్యాన్ని అంతకంతకు పెంచుతూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ జల దోపిడీతో వెనుకబడ్డ పాలమూరు జిల్లా ఎడారి కావాలా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్ ఏం కావాలి? అని ప్రశ్నించారు. తమ ప్రాజెక్టులు నిబంధనల ప్రకారమే నిర్మాణం అవుతున్నాయని ఏపీ మంత్రి చెప్పడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. కొత్తగా నీటి కేటాయింపులు జరగనంత వరకు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని మొదలు పెట్టమని ఏపీ సీఎం జగన్ కేంద్ర మంత్రికి అపెక్స్ కౌన్సిల్ లో హామీ ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ హామీ ని తుంగలో తొక్కి మోసం చేస్తోంది జగన్ కాదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు.

స్నేహ హస్తం అంటూనే వెకిలి చేష్టలు చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుమ్మెత్తిపోశారు. నోట్లో చక్కర.. కడుపులో కత్తెర.. అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం తీరు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులతో హైదరాబాద్‌కు తాగు నీళ్లు ఎలా? అని తెలంగాణలో ఉన్న సీమాంధ్ర సోదరులు కూడా అడుగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నపుడు ఇబ్బంది పెట్టారు.. రాష్ట్రం విడిపోయాక కూడా జల దోపిడీతో ఇబ్బంది పెడతారా? అని ఏపీ సర్కార్‌ని తెలంగాణ మంత్రి నిలదీశారు. గ్రీన్ ట్రిబ్యునల్, అపెక్స్ కౌన్సిల్ అంటే కూడా ఏపీ కి లెక్కలేదా? అని ప్రశ్నించారు. నీళ్ల తరలింపుపై టెలీ మెట్రీలు పెడతామంటే ఏవో కొర్రీలు చెబుతూ ఏపీ ప్రభుత్వం దాట వేస్తోందని ఆరోపించారు.

సామరస్యంతో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నట్టే ఏపీతో కృష్ణా జలాలపై అవగాహన ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను పిలిచామన్నారు. అయితే జగన్ మాత్రం సామరస్యంతో మసలుకోవడం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చేసినట్టే తమ ప్రభుత్వం కూడా చేస్తే ఒక్క నీటి చుక్క కూడా ఆ రాష్ట్రం వైపు వెళ్లదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘తాము పైన ఉన్నాం. ప్రాజెక్టులు ఎన్నయినా కొట్టుకోవచ్చు.. కానీ అలా చేయడం లేదు.’’ అని మంత్రి పేర్కొన్నారు. జగన్‌ను కేసీఆర్ తమ్ముడిలా భావించి స్నేహ హస్తం అందించినా సరిగా స్పందించలేదన్నారు.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ మంచికి మంచి వారు.. చెడుకు చెడ్డవారు.. ఇప్పటికైనా సయోధ్యకు ప్రయత్నించండి. మా పాలమూరును ఎడారి చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఎంతకైనా తెగిస్తాం. అనుమతులు వచ్చేదాకా ప్రాజెక్టుల ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు మొదలుపెట్టిన నాటినుంచే మేము పోరాటం చేస్తున్నాం. కొత్త ట్రిబ్యునల్ వేస్తామన్న కేంద్రం హామీ మేరకే సుప్రీం కోర్టులో కేసు ఉపసంహరించుకున్నాం. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. వాటిని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దని ఏపీ ప్రభుత్వానికి మనవి చేస్తున్నా. ఏపీ మొండి వైఖరి కొనసాగితే మహబూబ్‌నగర్ జిల్లాలోనే కృష్ణా జలాలను మళ్లించే వ్యూహం మాకు ఉంది. కృష్ణా జలాలను కేసీఆర్ దూరదృష్టితో వాడుకునే వ్యూహాన్ని అనుసరించబట్టే మహబూబ్‌నగర్ జిల్లాలో భూమి పుట్టినప్పటి నుంచి పండని పంట ఇప్పుడు పండింది.’’ అని మంత్రి శ్రీనివాస్ అన్నారు.

Also read:

Vijay Birthday: గ‌న్ను ప‌ట్టుకున్న ‘మృగం’.. విజ‌య్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ చూశారా..? హాలీవుడ్ స్థాయిలో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu