
తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మధ్యవర్తుల ప్రమేయం, అవినీతికి చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యవస్థను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఉండే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో ఆర్టీఏ సేవల్లో భారీగా అవినీతి జరుగుతోంది. అంతేకాకుండా రోజుల పాటు రవాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. దీనిని నివారించేందుకు ఫేస్‌లెస్ వ్యవస్థకు ప్రభుత్వం నాంది పలికింది. ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే అన్నీ సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. డ్రైవింగ్ టెస్ట్ మినహా మిగతా సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా పొందేలా మార్పులు చేస్తోంది.
నెక్ట్స్ జెన్ ఎంపరివాహన్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా వాహనదారులు అన్నీ సేవలు ఒకేచోట పొందవచ్చు. ఇప్పటివరకు కేవలం మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఆన్ లైన్ ద్వారా అని అయ్యేది. ఇక మిగతా సేవల కోసం తప్పనిసరిగా కార్యాలయాలను సంప్రదించాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి అన్నీ సేవలను ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్స్ పొందటం, అడ్రస్ మార్పులు, డేట్ ఆఫ్ బర్డ్ అప్డేట్, పేరు మార్పు, ఎల్‌ఎల్‌ఆర్, కండక్టర్ లైసెన్సుల జారీ వంటి సేవలు ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. ఎం పరివాహన యాప్ లేదా ఫ్లాట్ ఫామ్ ద్వారా డిజిటల్‌గానే వెరిఫికేషన్ పూర్తవుతుంది.
ఇక ఇప్పటివరకు ఆర్టీఏ సేవలు పొందేందుకు స్లాట్ బుకింగ్ సిస్టమ్ అమల్లో ఉంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న ఆర్టీఏ కార్యాలయానికి ఆ సమయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే కార్యాలయంలో ఎవరిని సంప్రదించాలో తెలియక ఏజెంట్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా పనులు త్వరగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ విధానం ద్వారా అవినీతి ఎక్కువగా జరుగుతుంది. కొన్నిసార్లు స్లాట్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్లాట్ బుకింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం భావించింది. దీనిపై ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ రిపోర్ట్ వచ్చాక కొత్త వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆన్ లైన్ సేవల వల్ల ప్రజలకు సమయం ఆదా అవుతుంది. అలాగే ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆర్టీఏ కార్యాలయల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పని ఉండదు.