Telangana Floods: ప్రమాదకర స్థాయికి కడెం ప్రాజెక్ట్‌లో వరదనీరు.. జేసీబీ సాయంతో 15వ గేటు ఓపెన్.. షాకింగ్ దృశ్యాలు

Kadem Project News: కడెం ప్రాజెక్టు కల్లోలం రేపుతోంది.. వరద భీకర రూపం దాల్చుతోంది. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. జలఖడ్గం దూసుకొస్తోంది.. లోతట్టు ప్రాంతాలను చీల్చుకుంటూ..ముంచుకుంటూ ముందుకెళ్తోంది.

Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 27, 2023 | 4:21 PM

Kadem Project: భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వస్తుండడంతో అధికారులు 15 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉండగా.. అందులో ప్రస్తుతం ఇంకా 3 గేట్లు మొరాయించాయి. కొద్ది సేపటి క్రితం 15వ గేటును జేసీబీ సాయంతో అతికష్టం మీద తెరిచారు. మొత్తం 15 గేట్లను ఎత్తి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నిండుకోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను తరలించి ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఆ ప్రాంత ప్రజలను తరలించేందుకు హెలికాఫ్టర్లను సిద్ధం చేశారు. వరద ఉధృతి పెరిగితే మొరాయించిన మిగిలిన మూడు గేట్లను ఎలా తెరుస్తారన్నది ఉత్కంఠరేపుతోంది.

ప్రాజెక్టు నిండుకోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను తరలించి ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే 15 గ్రామాల నుంచి దాదాపు 8 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. మరికొన్ని చోట్ల..ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు హెలికాఫ్టర్లను సిద్ధం చేశారు.

ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గినా..కడెం లో మాత్రం వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లో కొనసాగడంతో కడెం, కన్నపూర్, దేవునిగూడెం, రాపర్, మున్యాల్, గొడిషిరియల్, పెద్ద బెల్యాల్ , చిన్న బెల్యాల్ , పాండవ పూర్ గ్రామాలను‌ అలర్ట్ చేశారు.

గత ఏడాది కూడా ఇదే సీన్‌ రిపీటైంది..ఇంతకంటే దారుణ పరిస్థితి ఎదురైంది. అయినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు.. గతేడాది గుణపాఠాలను మైండ్‌కు ఎక్కించుకోకుండా మిన్నకుండిపోయారు. ఇప్పుడు మళ్లీ అర్రులు చాస్తున్నారు. ఎంత ప్రయత్నించినా నాలుగు గేట్లు గతంలో కూడా ఓపెన్‌ కాలేదు..ఈసారి అష్టకష్టాలు పడితే ఓ గేటు తెరుచుకుంది. మిగిలిన మూడు మాత్రం..మంకుపట్టు పట్టాయి.. అటు అధికారులు, ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎంత టెన్షన్‌ పడినా ప్రయోజనం లేని పరిస్థితి.. ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యం అని.. ఏడాదిగా మరమ్మత్తులు చేపట్టకపోవడంతో కడెం ప్రమాదం లో పడిందంటూ..డ్యాం పరిశీలనకు వచ్చిన మంత్రిని అడ్డుకున్నారు స్థానిక బాధితులు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..