తెలంగాణలో కరెంట్ షాక్ తప్పదా..! వాడీవేడిగా ఈఆర్సీ విచారణ.. పెంపు వద్దంటూ బీఆర్ఎస్ ఫైర్
తెలంగాణ ప్రజలకు త్వరలో షాక్ అంటూ ముందే హెచ్చరిస్తోంది విపక్షపార్టీ. విద్యుత్ చార్జీలు పెరుగుతాయంటోంది. ఈఆర్సీ బహిరంగ విచారణలో తమ వాదన వినిపించారు విపక్షనేతలు, వివిధరంగాల ప్రతినిధులు. డిస్కమ్‌లు ఈఆర్సీ ముందు పెట్టిన ప్రతిపాదనలేంటి? విద్యుత్ చార్జీలపై ఎవరి వాదనలెలా ఉన్నాయి?

తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. హైదరాబాద్ కల్యాణ్‌నగర్ ట్రాన్స్‌కో ఆఫీసులో జరిగిన ERC బహిరంగ విచారణలో విద్యుత్ చార్జీలపై చర్చలు జరిగాయి. తెలంగాణ డిస్కమ్ తమ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించింది. పంపిణీ నష్టాలను 4.75 శాతానికి తగ్గించామని, ప్రతీ యూనిట్‌కి 6రూపాయల 45పైసలు స్పెసిఫిక్ రెవెన్యూ వస్తోందని ఈఆర్సీకి నివేదించారు . నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ వినియోగదారుల ఫిక్స్‌డ్ ఛార్జీలపై స్వల్ప పెంపును ప్రతిపాదించింది TGSPDCL.పేద, మధ్య తరగతి గృహ వినియోగదారులపై ఎలాంటి భారం వేయటంలేదని సీఎండీ ముషారఫ్ ఫరూఖి పేర్కొన్నారు.
అయితే.. లోటును భర్తీచేసేందుకు మూడు కేటగిరీల్లో చార్జీలను సవరించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ఈఆర్సీ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే 1200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కమ్‌లు అంచనావేస్తున్నాయి. అయితే డిస్కమ్‌ల ప్రతిపాదనలను ఆమోదించవద్దని బహిరంగవిచారణకు ముందే ఈఆర్సీ ఛైర్మన్‌ని కలిశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అయితే.. తెలంగాణలో విద్యుత్‌చార్జీలు పెరగబోతున్నాయన్న బీఆర్‌ఎస్ , ఈఆర్సీ బహిరంగ విచారణలో తన వాదన వినిపించింది. ఈ ప్రతిపాదనలను విటో చేయాలని బీఆర్ఎస్.. ఈఆర్సీని కోరింది.
కాంగ్రెస్ ప్రభుత్వం డిస్కంలతో వ్యాపారం చేస్తోందని బీఆర్ఎస్ లీడర్లు మధుసూదనాచారి, మహమూద్ అలీ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని ఈఆర్సీకి తమ అభిప్రాయం చెప్పామన్నారు. విద్యుత్ డిమాండ్‌ని కావాలని అధికంగా చూపెడుతున్నారని వాదించారు విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాల్. డిస్కంల ఏఆర్ఆర్‌లతో వచ్చే ఐదు నెలల్లో సుమారు మూడు వేల కోట్ల భారం పడుతుందని అంచనావేశారు. ఛార్జీలు పెంచకుండానే భారం వేయాలని విద్యుత్ సంస్థలు చూస్తున్నాయన్నారు.
అయితే.. చార్జీల సవరణల ప్రతిపాదనలపై కనీసం మూడుచోట్ల పబ్లిక్ హియరింగ్‌ల తర్వాతే ఈఆర్సీ తుదినిర్ణయం ప్రకటిస్తుంది. ప్రజలపై భారం పడకుండా, విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..