Telangana Election: సాగర్‌లో లోకల్-నాన్ లోకల్ వార్.. యువనేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో లోకల్ - నాన్ లోకల్ వార్ నడుస్తుంది. యువ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పట్టు కోసం కాంగ్రెస్ పరితపిస్తుంటే.. అభివృద్ధికి పట్టం కట్టాలంటూ అధికార పార్టీ బీఆర్ఎస్ జనాన్ని ఏకం చేసే పనిలో పడింది. ఇప్పుడు నాగార్జునసాగర్ రాజకీయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ నాగార్జున సాగర్ లో ఏం జరుగుతోంది?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో లోకల్ – నాన్ లోకల్ వార్ నడుస్తుంది. యువ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పట్టు కోసం కాంగ్రెస్ పరితపిస్తుంటే.. అభివృద్ధికి పట్టం కట్టాలంటూ అధికార పార్టీ బీఆర్ఎస్ జనాన్ని ఏకం చేసే పనిలో పడింది. ఇప్పుడు నాగార్జునసాగర్ రాజకీయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ నాగార్జున సాగర్ లో ఏం జరుగుతోంది?
సాగర్ పేరు చెప్పగానే ప్రపంచ పర్యాటక కేంద్రం, తెలుగు రాష్ట్రాలకు వర ప్రదాయని నాగార్జునసాగర్ ప్రాజెక్టు గుర్తుకు వస్తుంది. రాజకీయాలు ఎన్నికల ప్రస్తావన రాగానే రాజకీయ దిగ్గజం, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గుర్తుకు వస్తారు. ఈ నియోజక వర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. గతంలో చలకుర్తిగా ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా నాగార్జున సాగర్‌గా మారిపోయింది.
ప్రస్తుతం నాగార్జున సాగర్ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరుగగా, ఇందులో జానారెడ్డి ఏడు సార్లు విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తొలి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి చెందారు. అయితే నోముల నర్సింహ్మయ్య అకాల మరణంతో 2021లో సాగర్‌లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నర్సింహ్మయ్య కొడుకు భగత్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి మరోసారి జానారెడ్డి పోటీ చేసినా ఓటమే పలుకరించింది. దీంతో జానారెడ్డి క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు.
ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి బరిలో దిగుతున్నారు. ఇద్దరు యువకులే కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇద్దరు నేతలు మాటల తూటాలతో ఎన్నికల రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే గిరిజన చైతన్య యాత్ర పేరుతో జైవీర్ రెడ్డి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వలసలతో కాంగ్రెస్ పార్టీకి జోష్ పెరిగింది. నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. హాలియా మండలం అనుముల జైవీర్ రెడ్డి స్వగ్రామం కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌ది.. నకిరేకల్ మండలం పాలెం గ్రామం.
అయితే ఇక్కడే అసలు రాజకీయాలు మొదలయ్యాయి. లోకల్ నాన్ లోకల్ అంశాన్నే ప్రధాన అస్త్రంగా ప్రచారం జోరందుకుంది. నోముల భగత్ స్థానికేతరుడు అంటూ స్థానికత అంశాన్ని ఎన్నికల అంశంగా కాంగ్రెస్ వాడుకుంటుంది. ఈ ఎన్నికలు స్థానికులు- స్థానికేతరులకు మధ్య జరుగుతున్న పోరు అని కాంగ్రెస్ చెబుతోంది. ఎమ్మెల్యే స్థానికుడైతేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, స్థానికులకే పట్టం కట్టాలని కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి పిలుపునిస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక కాంగ్రెస్ స్థానికత అంశాన్ని ఎత్తుకుందని ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శిస్తున్నారు. 36 ఏళ్లుగా స్థానికుడిగా ఉన్న జానారెడ్డి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడని ధ్వజమెత్తారు. లోకల్ నాన్ లోకల్ అంశాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు భరత్. బీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి చెందిందని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ జన్మిస్తేనే స్థానికుడు కాదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వాడే స్థానికుడవుతారని భగత్ స్పష్టం చేస్తున్నారు. ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మొత్తంగా యువ నేతల మాటల తూటాలతో హీటెక్కుతున్న నాగార్జునసాగర్‌లో ప్రజలు స్థానికత అంశాన్ని పట్టించుకుంటారో లేదో ఎన్నికల్లో వేచి చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…