AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ ఫామ్ చేతికొచ్చే సమయంలో తెరపైకి అసమ్మతి.. చిక్కుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే

నడిగడ్డ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు కాకా రేపుతున్నాయి. అలంపూర్ బీఆర్ఎస్‌లో అసమ్మతి చిలికి చిలికి గాలివానలా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న నేతలు క్యాండేట్‌ని మార్చాల్సిందేనంటున్నారు. మరోవైపు అభ్యర్థిని మార్చే ఆలోచన చేయకుండా వెంటనే బీఫాం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అనుకూల వర్గం డిమాండ్ చేస్తోంది.

బీ ఫామ్ చేతికొచ్చే సమయంలో తెరపైకి అసమ్మతి.. చిక్కుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే
Alampur Brs Leaders
Balaraju Goud
|

Updated on: Oct 16, 2023 | 5:54 PM

Share

నడిగడ్డ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు కాకా రేపుతున్నాయి. అలంపూర్ బీఆర్ఎస్‌లో అసమ్మతి చిలికి చిలికి గాలివానలా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న నేతలు క్యాండేట్‌ని మార్చాల్సిందేనంటున్నారు. మరోవైపు అభ్యర్థిని మార్చే ఆలోచన చేయకుండా వెంటనే బీఫాం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అనుకూల వర్గం డిమాండ్ చేస్తోంది.

టికెట్‌ ఆయనకే ప్రకటించారు. బీఫాం చేతికొస్తుందనుకున్న టైములో అసమ్మతి వర్గం అడ్డుపడింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ బీఆర్‌ఎస్‌లో అసమ్మతి గొంతు పెరుగుతోంది. ఎమ్మెల్యే అబ్రహాంకే మళ్లీ టికెట్‌ ఇవ్వడాన్ని అధికార బీఆర్ఎస్ పార్టీలోని కొందరు బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ అభ్యర్థిని మార్చకపోతే పార్టీ గట్టెక్కడం కష్టమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వ్యతిరేకవర్గం ప్రచారాన్ని నమ్మొద్దంటోంది ఎమ్మెల్యే వర్గం. అభ్యర్థి మార్పు ఆలోచనే వద్దని అధినాయకత్వానికి మొరపెట్టుకుంటున్నారు అబ్రహాం అనుచరులు. రెండువర్గాల పోటాపోటీ సమావేశాలు అలంపూర్ బీఆర్ఎస్‌లో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.

అలంపూర్‌ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే అబ్రహాం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గాలుగా వచ్చిన చీలిక కేడర్‌లో గందరగోళం సృష్టిస్తోంది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎలాగైనా మార్చాలని బీఆర్ఎస్‌లోని ఓ వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అబ్రహాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలంపూర్ ఎమ్మెల్యేకి మద్దతిచ్చే ప్రసక్తే లేదంటూ ఎర్రవల్లి మండలం బీచుపల్లి దగ్గర అసమ్మతి నేతలు ఓ మీటింగ్‌ పెట్టుకున్నారు. అబ్రహాంని మార్చాలంటూ ఏకంగా ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి ఏకవాక్య తీర్మానం సమర్పించారు. అబ్రహాం స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించాలని కోరారు.

ఎమ్మెల్సీతో విభేదాలున్నా, కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తినా టికెట్‌ సిట్టింగ్‌కే ప్రకటించటంతో నిశ్చింతగా ఉన్న అబ్రహాం వర్గం.. తాజా పరిణామాలతో అలర్ట్‌ అయింది. అలంపూర్‌ విషయంలో అధిష్ఠానం మరో ఆలోచన చేయాల్సిన అవసరమే లేదంటోంది అబ్రహాం వర్గం. అలంపూర్‌లో అబ్రహాంకే తమ మద్దతుందని మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు సిట్టింగ్‌ని సమర్ధిస్తున్న నేతలు. ఒకవేళ ఆయన టికెట్‌ మారిస్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా నిలబెట్టి గెలిపించుకుంటామని ఎమ్మెల్యే అబ్రహాం అనుకూలవర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు.

బీ ఫామ్ చేతికొచ్చే సమయంలో అసమ్మతి తెరపైకి రావడంతో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం చిక్కుల్లో పడ్డారు. సీఎం కేసీఆర్ తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులకు బీ ఫాంలు అందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన అభ్యర్థులందరికీ బీఫాంలు ఇచ్చిన అధినేత.. అలంపూర్‌ విషయంలో పునరాలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అలంపూర్‌ అభ్యర్థిని మార్చే ఆలోచనతోనే ఆయనకు బీఫాం ఇవ్వలేదంటోంది ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం. దీంతో అలంపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మార్చే అవకాశం ఉందా? చివరికి బీ ఫాం ఎవరికిస్తారన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..