బీఆర్‌ఎస్‌లో బీఫామ్ అందని ఆ 18 మందికి టెన్షన్.. బిగ్ బాస్ మదిలో ఏముంది..?
Telangana Elections: కొంచెం నీరు.. కొంచెం నిప్పులా ఉంది బీఆర్‌ఎస్‌లో పరిస్థితి. కొందరికి మోదం.. కొందరికి ఖేదం. బీఫామ్స్ అందుకున్న నేతలు తమతమ నియోజకవర్గాల్లో రయ్యిరయ్యిన దూసుకుపోతున్నారు. ఆ కాగితాలందక, పార్టీ అధినేత నుంచి రాజముద్ర పడక... పరేషాన్‌లో మునిగిపోయారు మరికొందరు. ఆ మరికొందరు ఎందరు.. ఎవరు.. వాళ్ల ఫ్యూచరేంటి..? ఇదే గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్న అంశం.

కలర్‌ఫుల్ హామీలతో ఖతర్నాక్ మేనిఫెస్టోను జనంలో పెట్టి.. దూసుకుపోతోంది కారు పార్టీ. హుస్నాబాద్‌లో ఫస్ట్ కిక్ కొట్టి గేరు మార్చి.. మరుసటి రోజే ప్రచారాన్ని జోరెత్తించారు సీఎం కేసీఆర్. ఇవాళ రెండు బహిరంగసభల్లో ప్రసంగించి క్యాడర్‌కి ఊపునిచ్చారు. కానీ… కొందరు లీడర్లలో మాత్రం ఆ జోష్ మచ్చుకైనా కనిపించడం లేదట. బీఫామ్స్ టెన్షన్ పట్టుకుని… రేపటి గురించి ఆందోళన పడుతున్నారు బీఆర్‌ఎస్‌లో 18 మంది నేతలు. సింగిల్ స్ట్రోక్‌తో, సింగిల్ లిస్టుతో అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేశారన్న మాటే గాని.. పార్టీలో జాబితాల టెన్షన్ మాత్రం తప్పలేదట.
మొదట్లో బీఫామ్స్ అందరికీ ఒకేసారి ఇస్తారనుకున్నారు. కానీ… 51 మందికే బీఫామ్స్ రెడీ అయ్యాయంటూ ఆదివారం తెలంగాణా భవన్‌లో ఆ 51 మందికి మాత్రమే తన చేతుల మీదుగా అందజేశారు కేసీఆర్. బోనస్‌గా ప్రచార ఖర్చు కోసం 40 లక్షల చెక్కు కూడా ఇచ్చారు. ఆదివారం రాత్రే మరో 18 మందికి… సోమవారం ఉదయం మరో 28 మందికి బీఫామ్స్ అందాయి. అంటే… మొత్తం 97 మందికి మాత్రమే పార్టీ నుంచి అనుమతి పత్రాలు వచ్చినట్టు. మొత్తం 119 నియోజకవర్గాల్లో నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి, మల్కాజ్‌గిరి.. ఈ నాలుగు సెగ్మెంట్లలో అధికారికంగానే అభ్యర్థులు ఖరారు కాలేదు. మిగతా 115 మందిలో 97 మంది బీఫామ్స్ అందుకున్నారు.. మిగతా 18 మందిలో పరేషాన్ మొదలైంది. మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు టికెట్ కన్‌ఫమ్ చేసినా.. ఆయన రాజీనామా చేయడంతో.. ఆ నియోజకవర్గం మళ్లీ పెండింగ్‌లో పడింది. జనగామ నుంచి చివరి నిమిషంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ ఖరారైంది. ఆయన కూడా బీఫామ్ అందుకున్నారు.
రెండురోజుల్లోగా అభ్యర్థులందరికీ బీఫామ్స్ వచ్చేస్తాయి.. ఫికర్ మత్ కరో అని కేసీఆర్ మాటిచ్చినా.. ఈ 18 మందిలో పరేషాన్ తప్పడం లేదు. ఇలా బీఫామ్స్ అందనివాళ్లలో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇలా ఆచితూచి, విడతలవారీగా బీఫామ్స్ అందజేస్తూ.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్. బిగ్‌బాస్ మనసులో ఏముందో తెలీక సతమతం కావడం నేతల వంతైంది. అటు.. ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని మారుస్తారన్న ఊహాగానాలు పార్టీ లోపలా బైటా గట్టిగా వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఈ 18 మందిలో టెన్షన్ పెరిగిపోతోంది. సో… ఎవరికి ఎర్త్.. ఎవరికి బెర్త్.. అనే టెన్షన్ కారు పార్టీలో ఇంకా వీడనే లేదు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
