AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: కాంగ్రెస్‌ను టచ్ చేసి.. కమలం గూటికి బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

మొన్నటి వరకు జై బీఆర్ఎస్ అని నినదించిన ఆ ఎమ్మెల్యే సిట్టింగ్ సీటు దక్కకపోవడంతో, కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం సీటు ఇవ్వలేమంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయారు. కారు కాదు, కాంగ్రెస్ కాదు. ఎన్నికల్లో తన బలం ఏంటో చూపాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాల్సిందే అని ఫిక్స్ అయి కమలం గూటిలో చేరిపోయారు.

Telangana Election: కాంగ్రెస్‌ను టచ్ చేసి.. కమలం గూటికి బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
Rathod Bapurao
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Nov 01, 2023 | 6:00 PM

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ గూటి చేరిపోయారు. మొన్నటి వరకు జై బీఆర్ఎస్ అని నినదించిన ఆ ఎమ్మెల్యే సిట్టింగ్ సీటు దక్కకపోవడంతో, కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపి హస్తం గూటికి చేరేందుకు‌ సిద్దమయ్యారు. కానీ అంతలోనే కాంగ్రెస్ అధిష్టానం సైతం సీటు ఇవ్వలేమంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయారు. కారు కాదు, కాంగ్రెస్ కాదు. ఎన్నికల్లో తన బలం ఏంటో చూపాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాల్సిందే అని ఫిక్స్ అయి కమలం గూటిలో చేరిపోయారు. కానీ అప్పటికే ఆ నియోజక వర్గ బీజేపీ టికెట్ కూడా ఖరారు కావడంతో తప్పని పరిస్థితుల్లో ఆగమేఘాల మీద కాషాయ జెండా కప్పుకున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే కమలం బాట పట్టడం వెనుక కారణాలేంటి..? ఎంపీ సీటు ఖాయం కావడంతోనే కారు దిగి కాషాయం తీర్థం పుచ్చుకున్నారా..?

ఆదిలాబాద్ జిల్లా ఎస్టీ రిజర్వ్ నియోజక వర్గం బోథ్ లో రాజీనామాల పర్వంతోరాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు‌ దక్కకపోవడంతో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అక్టోబర్ 19న ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజీపీ‌గూటికి చేరిపోయారు. అయితే రాథోడ్ బాపురావు‌ డైరక్ట్‌గా కారు దిగి కమలం గూటికి చేరకుండా మధ్యలో‌ కాంగ్రెస్ ను సైతం టచ్ చేసి చూశారు. బోథ్ ఎమ్మెల్యే సీటు ఇస్తానంటే హస్తం తీర్థం పుచ్చుకుంటానంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో మంతనాలు‌ సైతం జరిపిన రాథోడ్ బాపురావు.. తన అనుచరులతో కలిసి జై కాంగ్రెస్ అంటూ ఓ వారం పాటు గట్టిగానే గర్జించారు.

కానీ కాంగ్రెస్ సైతం రాథోడ్ బాపురావు కు టికెట్ నిరాకరించి ఆ పార్టీ నేత వన్నెల అశోక్ కు టికెట్ కట్టబెట్టి గట్టి షాక్ ఇవ్వడంతో గింగిరాలు తిరిగిపోయారు రాథోడ్ బాపురావు. దీంతో మళ్లీ డైలామాలో పడ్డ రాథోడ్ బాపురావు తనకు టికెట్ దక్కకుండా చక్రం తిప్పిన నేతల అపజయమే లక్ష్యంగా బీజేపీ గూటికి చేరేందుకు మంతనాలు జరిపారు. అప్పటికే బోథ్ బీజేపీ టికెట్ ఎంపీ సోయం బాపురావుకు ఖరారైందని తెలిసినా, బీఆర్ఎస్ టికెట్‌ను కైవసం చేసుకున్న అనిల్ జాదవ్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఏదో‌ ఒక‌ పార్టీలో చేరక తప్పదని అనుచరులు పట్టుపట్టడంతో ఆగమేఘాల మీద ఢిల్లీ పయనమైన రాథోడ్ బాపురావు.. కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఎలాగు అవకాశం లేకపోవడంతో కనీసం ఎంపీగా అయినా అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ పెద్దలను కోరడం.. అందుకు బీజేపీ ఓకే చెప్పడంతో రాథోడ్ బాపురావు బీజేపీలో చేరిపోయారు.

రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరడంతో ఆదిలాబాద్ పార్లమెంట్‌లో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. బోథ్‌లో బలమైన కేడర్ ఉన్న లీడర్ కావడం, వరుసగా రెండు‌సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన నాయకత్వంతో బీజేపీకి బోథ్‌లో డబుల్ బూస్ట్ వచ్చినంత పనైంది. ఇప్పటికే బోథ్‌లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగగా.. సోయంకు రాథోడ్ తోడవడంతో బీజేపీకి మరింత జోష్ వచ్చినట్టుగా భావిస్తోంది కమలం పార్టీ.

మొత్తానికి సిట్టింగ్ సీటు దక్కకపోగా.. పక్క పార్టీలోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశలు గల్లంతైన రాథోడ్, కాషాయ గూటికి చేరడం వెనుక పెద్ద స్కెచే ఉందన్నా రాజకీయ చర్చ అయితే బోథ్ లో జోరుగా సాగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…