Meditation: ఒత్తిడిని చిత్తు చేసే సూపర్ మంత్ర ఇదే! ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?
Mediation: మానసిక, శారీరక ఆరోగ్యానికి ధ్యానం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒక నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రశాంత ప్రదేశంలో చేస్తే ఇంకా మంచిది. ప్రాణాయామం సంబంధిత గురువుల నుంచి సూచనలు తీసుకుని చేస్తే మంచి ఫలితాలుంటాయి. ధ్యానం భావోద్వేగ ఆరోగ్యాన్ని, స్పష్టమైన మనసుకు కారణమవుతుంది. ఇది సృజనాత్మక మనస్తత్వాన్ని సృష్టిస్తుంది.

అనేక ఆరోగ్య, మానసిక సమస్యలకు మన పూర్వీకులైన రుషులు అద్భుతమైన పరిష్కారాలను అందించారు. అందులో ఒకటి ధ్యానం. ధ్యానంలో అనేక రకాలున్నాయి. ఇవన్నీ శరీర, మానసికంగా అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం అద్బుతమైన మార్గమని చెప్పవచ్చు.
మైండ్ ఫుల్నెస్, మూడ్ మెడిటేషన్
ఈ ధ్యాన ప్రక్రియలో మీరు ప్రస్తుత క్షణంలో లేదా ప్రస్తుత రోజు ఏమీ ఆలోచిస్తున్నారో, అనుభూతి చెందుతున్నారో, అనుభవిస్తున్నారో దాని గురించి ధ్యానం చేస్తాం. ఇది మీ ఆలోచనలపై నియంత్రణను ఇవ్వడంతోపాటు శ్వాస, శరీరాన్ని ఉన్నత స్థితికి తీసుకొస్తుంది. ఇక, అతింద్రీయ ధ్యానంలో మనస్సు ఒక శబ్ధం లేదా మంత్రంపై దృష్టి పెట్టడం ద్వారా లోతైన విశ్రాంతి స్థితిలోకి ప్రవేశిస్తుంది. ఓం లేదా ఇతర మంత్రోచ్ఛారణలతో ఇలా చేయవచ్చు. దీంతో మానసిక ప్రశాంతతతోపాటు అనేక ప్రయోజనాలున్నాయి. ఈ ధ్యాన్ని మహిర్షి మహేశ్ యోగి బోధించారు.
ప్రేమించడం మొదలు పెడతారు
ఈ ధ్యానం ద్వారా మనం ప్రపంచంలోని ప్రతీ దానిని ప్రేమించడం ప్రారంభిస్తాం. ఇది మీ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి విస్తరిస్తుంది. దీంతో ఆ ప్రపంచం మిమ్మల్ని కూడా ప్రేమించడం ప్రారంభిస్తుంది. తల నుంచి కాలి వరకు శరీర భాగాలను సునిశితంగా పరిశీలించడం కూడా ఒక రకమైన ధ్యానమే. ఇవి కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల ఆందోళన, నిరాశ తగ్గుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ధ్యానంతో ఏకాగ్రత
ధ్యానం భావోద్వేగ ఆరోగ్యాన్ని, స్పష్టమైన మనసుకు కారణమవుతుంది. ఇది సృజనాత్మక మనస్తత్వాన్ని సృష్టిస్తుంది. ధ్యానం సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు మీకు సహాయపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ధ్యానం ద్వారా శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుందని అంటున్నారు. ధ్యానం మెదడు నిర్మాణంలో సానుకూల మార్పులకు కారణమవుతుందని పరిశోధకుడు జెఫ్ వారెన్ వెల్లడించారు. ధ్యానం స్వీయ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
ధ్యానంతో బీపీకి చెక్
ధ్యానం చేయడం వల్ల అధిక రక్తపోటును కూడా తగ్గించుకోవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2013 నుంచి నిర్వహించిన వివిధ అధ్యయనాలు ఇదే విషయాన్ని తేల్చాయి. క్రమం తప్పకుండా ధ్యానం చేసేవారు వివిధ అనారోగ్య, మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నాయి.
ధ్యానంతో ఇన్ని ప్రయోజనాలా?
ధ్యానం నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. దీంతో పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. మంచి నిద్రతో రోజువారీ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. అంతేగాక, ధ్యానం శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వ్యాధి సహజ నిరోధకతను పెంచే కణజాలాలు ధ్యానం ద్వారా అవసరమైన శక్తిని పొందుతాయి. ధ్యానం వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అంతేగకా, మధుమేహం, ఆల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధుల నుంచి కూడా ధ్యానం మనల్ని కాపాడుతుంది. డ్రగ్స్ కు బానిసైన వ్యక్తులు కూడా ధ్యానం క్రమం తప్పకుండా చేస్తే వాటికి దూరం అవుతారు.
అటు మానసికంగా, ఇటు శరీరకంగా ఎన్నో ప్రయోజనాలను కలిగించే ధ్యానం ప్రతిరోజు చేయాలి. ఒక నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రశాంత ప్రదేశంలో చేస్తే ఇంకా మంచిది. ప్రాణాయామం సంబంధిత గురువుల నుంచి సూచనలు తీసుకుని చేస్తే మంచి ఫలితాలుంటాయి. ధ్యానం, ప్రాణాయామాన్ని ప్రతిరోజూ క్రమ తప్పకుండా చేస్తూ శరీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.