Revanth Reddy: కొడంగల్‌పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. దౌల్తాబాద్ రోడ్ షోలో ఆసక్తికర సన్నివేశం..
రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గంపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇవాళ ఒక్కరోజే కొడంగల్‌లోని మూడు మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు వివరిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
Telangana Assembly Election 2023: రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గం కొడంగల్ పైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇవాళ ఒక్కరోజే కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రోడ్ షో ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దౌల్తాబాద్, మద్దూరు, కోస్గిలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. తను కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రెండుసార్లు అధికారమిస్తే చేసిందేమీ లేదు గానీ.. మళ్లీ అధికారం కావాలని ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారని ప్రశ్నించారు. ఓట్లు వేయించుకుని పనులు చేయకుండా కాలయాపన చేసిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.
గుర్నాథరెడ్డితో క్షమాపణ చెప్పించిన రేవంత్..
అంతకుముందు దౌల్తాబాద్ రోడ్‌షోలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తిట్టారంటూ మహిపాల్‌రెడ్డి వర్గీయులు రేవంత్ ముందే గొడవకు దిగారు. రోడ్‌షో చేస్తున్న వాహనంపైనే వాగ్వాదానికి దిగారు. దీంతో గుర్నాథరెడ్డితో క్షమాపణ చెప్పించారు రేవంత్‌రెడ్డి.
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని సోనియా గాంధీ భావించారు. కానీ ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందని కాంగ్రెస్ ఇంఛార్జ్ మానిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు.
తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అనే ప్రోగ్రామ్‌లోనూ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మతపెద్దలు కొన్ని డిమాండ్లతో ఓ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ ఆమోదించేందుకు తనవంతు కృషి చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డిసెంబర్ అంటే మిరాకిల్ నెల. 2023 డిసెంబర్‌లో ఒక మిరాకిల్ జరగబోతుందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ కాంగ్రెస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..