Batti Vikramarka: ప్రధాని మోదీతో చర్చించిన అంశాలివే.. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని కలిశారు రేవంత్ రెడ్డి. ఈయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

Batti Vikramarka: ప్రధాని మోదీతో చర్చించిన అంశాలివే.. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Deputy Cm Batti Vikramarka
Follow us
Srikar T

|

Updated on: Dec 26, 2023 | 7:40 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని కలిశారు రేవంత్ రెడ్డి. ఈయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రధాని మోదీని కలిసి వచ్చిన తరువాత సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని కలిశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

సమాఖ్య స్ఫూర్తిలో భాగంగానే ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశామని ఈ సందర్భంగా చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‎లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీకి సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. 2019 -20 నుంచి 2023- 24 వరకు పెండింగ్లో ఉన్న దాదాపు 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే 2019 -20, 2020-21 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు 450 కోట్ల రూపాయలను విడుదల చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన 2,250 కోట్ల రూపాయల గ్రాంట్స్ ను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కోరామన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను సాధించటంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రధానితో చర్చించామని ఈ సందర్భంగా వెల్లడించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. విభజన చట్ట ప్రకారం ఒక మేజర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగామన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరామని తెలిపారు. పెండింగ్‎లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామని వివరించారు. తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక స్కూల్ మంజూరు చేయాలని అడిగామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం వివరాల గురించి ప్రధానమంత్రికి నివేదిక ఇవ్వడం జరిగిందని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..