Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malkajgiri Lok Sabha Election: తెలంగాణలో హాట్ సీట్‌.. ఈ సారి మల్కాజ్‌గిరి ‘బాద్‌ షా’ ఎవరు..? పోటీకి సై అంటున్న ఆ నేతలు..

Malkajgiri Lok Sabha constituency: సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. నెక్ట్స్ అక్కడ ఎవరు పోటీ చేస్తారు ? రాజకీయ పక్షాల లెక్కలేంటీ ? కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కాపాడుకుంటుందా ? పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో పట్టు నిలుపుకుంటుందా ? పట్టణ ప్రాంత ఓటర్లు తమవైపు నిలుస్తారని ఆశలు పెట్టుకున్న బీజేపీ ఉనికి చాటుకుంటుందా ? మల్కాజిగిరిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి..? అనేది ఆసక్తికరంగా మారింది.

Malkajgiri Lok Sabha Election: తెలంగాణలో హాట్ సీట్‌.. ఈ సారి మల్కాజ్‌గిరి ‘బాద్‌ షా’ ఎవరు..? పోటీకి సై అంటున్న ఆ నేతలు..
Revanth Reddy , Kcr , Kishan Reddy In Malkajgiri
Follow us
TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 26, 2023 | 4:48 PM

Malkajgiri Lok Sabha constituency: మల్కాజ్‌గిరి.. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం.. ఈ నియోజకవర్గంలో 31 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.. లక్షలాది మంది ఉండే ఈ నియోజకవర్గం.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హాట్ సీట్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. నెక్ట్స్ అక్కడ ఎవరు పోటీ చేస్తారు ? రాజకీయ పక్షాల లెక్కలేంటీ ? కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కాపాడుకుంటుందా ? పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో పట్టు నిలుపుకుంటుందా ? పట్టణ ప్రాంత ఓటర్లు తమవైపు నిలుస్తారని ఆశలు పెట్టుకున్న బీజేపీ ఉనికి చాటుకుంటుందా ? మల్కాజిగిరిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి..? అనేది ఆసక్తికరంగా మారింది.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం.. దేశంలోనే అతిపెద్ద లోక్‌ సభ స్థానం.. ఈ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కూకట్ పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఐదు నియోజకవర్గాలు… రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను కలిపి 2009లో మల్కాజిగిరి లోక్‌ సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. 30 లక్షలకు పైగా ఓట్లున్న అతిపెద్ద లోక్ సభ స్థానంలో సుమారు 4వేలకు పైగా బూత్ లు ఉన్నాయి. ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ లో కీలకమైంది. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల వారు నివాసముంటారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల ప్రజలు కలిసి ఉండే ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువైన పనేం కాదు. అయినా ఇక్కడ నుంచి పోటీకి అన్ని రాజకీయ పక్షాల్లో పోటీ తీవ్రంగా ఉంది.

కాంగ్రెస్ కసరత్తు..

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నేతలు.. లోక్‌ సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇటీవల కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మరో నాలుగు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా… ఎమ్మెల్యేగా ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావును నిలబెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.. అయితే సీఎం రేవంత్ రెడ్డి.. తన సిట్టింగ్ ఎంపీ స్థానం నుంచి తన కుటుంబ సభ్యులను బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కసీటును కూడా కాంగ్రెస్ గెలవలేదు. మరి సిట్టింగ్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుందో ? లేదో చూడాలి.

ధీమాతో బీఆర్ఎస్..

మల్కాజిగిరి పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాలను గెలిచిన బీఆర్ఎస్.. ఖచ్చితంగా ఎంపీ సీటును కూడా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తన కొడుకును ఎంపీగా బరిలో దింపే ఛాన్స్ ఉందని ప్రచారం. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు.. తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అధిష్టానానికి దగ్గరగా ఉండే హైదరాబాద్ మహానగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరికితోడుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మల్కాజిగిరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారట. గులాబీ బాస్ మల్కాజిగిరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాల్సి ఉంది.

బీజేపీ నేతల పైరవీలు..

బీజేపీ నేతలు మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల హుజురాబాద్, గజ్వేల్ రెండు స్థానాల్లో పరాజయం పాలయ్యారు. మల్కాజిగిరిలో పోటీకి ఈటల సై అంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మల్కాజిగిరిలో ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి.. మల్కాజిగిరి పార్లమెంట్ సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు కూన శ్రీశైలం గౌడ్, సామ రంగారెడ్డి, రాంచందర్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. వారితో పాటు వీరేందర్ గౌడ్ లాంటి మరో అర డజను మంది నేతలు పోటీకి దిగుతామని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ ఎంపీగా గెలిచిన వారు… మంత్రిగా.. ముఖ్యమంత్రిగా ఎదుగుతున్నారనే సెంటిమెంట్ బలంగా ఉంది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఏ పార్టీ ఎవరిని బరిలో దింపుతోంది ? ఎవరు పాగా వేస్తారనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఓపికపట్టాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..