Telangana: సీఎస్ఆర్ నిధుల వినియోగానికి ప్రత్యేక పాలసీ.. టార్గెట్ భారీగా పెంచిన ప్రభుత్వం!
రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం రూ.800 కోట్ల ఉన్న CSR వ్యయాన్ని రూ. 2,500 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ లక్ష్యం సాధన కోసం 'తెలంగాణ సీఎస్ఆర్' పేరుతో స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇది నిధుల సేకరణ, వినియోగాన్ని పారదర్శకంగా మార్చి, విద్య, వైద్యం, పర్యావరణ రంగాలలో మార్పులు తీసుకురానుంది.

రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు కొత్త పాలసీపై కసరత్తు జరుగుతోంది.ప్రస్తుతం రాష్ట్రంలో కంపెనీలు ఖర్చు చేస్తున్న సీఎస్ఆర్ నిధులు సంవత్సరానికి రూ.700 నుంచి 800 కోట్ల మధ్యే ఉన్నాయి. అయితే పారిశ్రామిక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని రూ.2,500 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ‘తెలంగాణ సీఎస్ఆర్’ పేరుతో స్వయంప్రతిపత్తి గల ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ సంస్థ ద్వారా నిధుల సేకరణ, వినియోగం మరింత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సీఎస్ఆర్ నిధుల్లో తెలంగాణ వాటా ప్రస్తుతం సుమారు 3 శాతం మాత్రమే ఉంది. దీన్ని కనీసం 10 శాతానికి పెంచేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటివరకు కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధులను విడివిడిగా వినియోగిస్తున్నాయి. కొత్త విధానంతో వాటిని ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు అనుసంధానం చేసి విద్య, వైద్యం, పర్యావరణ రంగాల్లో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటానమస్ సంస్థ ఏర్పాటుతో నిర్ణయాల వేగం పెరగడంతో పాటు కంపెనీలకు నిధుల వినియోగంపై స్పష్టత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్వరలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు సేకరించి పాలసీకి తుది రూపు ఇవ్వనున్నారు.
ఇప్పటివరకు సీఎస్ఆర్ నిధుల వినియోగం ఇలా ఉంది
2019-20లో రూ.610 కోట్లు ఖర్చు కాగా 2020-21లో రూ.730 కోట్లు వినియోగం జరిగింది. ఇక 2021-22లో రూ.780 కోట్లు ఖర్చు చేయగా 2022-23లో రూ.840 కోట్లు వినియోగించారు. ఇక 2023-24లో రూ.900 కోట్లకు చేరిన సీఎస్ఆర్ ఖర్చు అయ్యాయి. ఈ గణాంకాలు ప్రతి ఏడాది సీఎస్ఆర్ వ్యయం పెరుగుతున్నట్టు చూపుతున్నప్పటికీ, రాష్ట్ర సామర్థ్యానికి ఇంకా తక్కువగానే ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సీఎస్ఆర్ నిధులు ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. కొత్త విధానంతో వెనుకబడిన జిల్లాలపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తూ గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా మోడళ్లను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా తెలంగాణకు సరిపోయే విధంగా సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త పాలసీ అమలులోకి వస్తే నిధుల సేకరణ పెరగడంతో పాటు వినియోగంపై పర్యవేక్షణ కూడా మెరుగుపడుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
