Ponguleti Srinivas Reddy: నాకు ముందే తెలుసు.. నేను ఏ తప్పూ చేయలేదు.. ఐటీ దాడులపై స్పందించిన పొంగులేటి..
Ponguleti Srinivas Reddy - IT Raids: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఐటీ సోదాల కలకలం కొనసాగుతోంది. మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంతో పాటు స్వగ్రామం నారాయణపురం, హైదరాబాద్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.

Ponguleti Srinivas Reddy – IT Raids: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఐటీ సోదాల కలకలం కొనసాగుతోంది. మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంతో పాటు స్వగ్రామం నారాయణపురం, హైదరాబాద్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పొంగులేటి కుమారుడి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తు్న్నారు. హైదరాబాద్ నందగిరిహిల్స్‌లోని జ్యోతి హిల్‌రిడ్జ్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఐటీ దాడులు జరుగుతాయని ముందే తెలుసు.. తాను ఏ తప్పు చేయలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే దాడులు జరుగుతున్నాయని.. కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తాను ఈ రోజే నామినేషన్ వేస్తానని.. లేకుంటే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్పినట్లు పొంగులేటి తెలిపారు.
నామినేషన్ వేయడానికి ఐటి అధికారులు అనుమతి ఇవ్వడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. మరి కాసేపట్లో ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేయనున్నారు.
కాంగ్రెస్ సునామీని ఆపేందుకే..
కాగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై IT దాడులను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ సునామీని ఆపేందుకే ఐటీ దాడులు చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రపన్నాయని.. ప్రజలంతా గమనిస్తున్నారంటూ పేర్కొన్నారు.
ఖమ్మంలో ఉద్రిక్తత..
పాలేరు అభ్యర్ధిగా నేడు నామినేషన్ వేసేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐటీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ఐటీ దాడులు రాజకీయ కుట్ర అని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. సోదాలకు నిరసనగా ఖమ్మంలోని ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి భారీగా చేరుకున్న పొంగులేటి అనుచరులు.. ఆందోళన చేస్తున్నారు. దీంతో ఖమ్మంలోని పొంగులేటి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పొంగులేటి ఇంటి గేట్లు ఎక్కిన కార్యకర్తలు.. ఇంటి లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఖమ్మంలో పొంగులేటి ఫ్లెక్సీలకు అనుచరులు పాలాభిషేకం కూడా నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..