చారిత్రక నగరం ఓరుగల్లు జాతీయస్థాయి మెడికల్ హబ్‌గా మారనుంది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్‌ను ప్రభుత్వం వరంగల్‌లో నిర్మిస్తోంది. AIMS స్థాయి సేవలను ఈ ఆస్పత్రిలో అందుబాటులోకి తేనుంది ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్న తెలంగాణ సర్కార్ ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి పెద్దా ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా వెయ్యి కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు.
ఇటీవల కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హాంగులతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఈ దవాఖాన ప్రత్యేకత. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఇవాళ ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.