CM KCR: రోడ్డు మార్గానే సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల పర్యటన.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే రద్దు..
హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.
Telangana Floods: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గోదావరి (Godavari River) ముంపు ప్రాంతాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు బయలు దేరారు. వర్షం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ పర్యటన రద్దయింది. దీంతో ఆయన రోడ్డు మార్గంలోనే ముంపు ప్రాంతాల పర్యటనకు ఆదివారం ఉదయం బయలుదేరారు. హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గూడెపహడ్, ములుగు, గోవిందరావుపేట మీదుగా ఏటూరునాగారం చేరుకుంటారు. దాదాపు నాలుగు గంటలపాటు రోడ్డు మార్గం ద్వారానే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం ఏటూరు నాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో వరద పరిస్థితిపై ప్రజాప్రతినిథులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేయనున్నారు
ములుగు పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ఇల్లందు, పాత పాల్వంచ మీదిగా రోడ్డు మార్గాన భద్రాచలం వరకు పర్యటించనున్నారు. పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి ముందు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణించనున్నారు. కావున టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వనమా స్వగృహానికి రావాలంటూ పార్టీ నేతలు పేర్కొన్నారు.
కాగా.. ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా.. శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయి ముంపు నష్టం వివరాలు తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, సీఎంవో కార్యదర్శి స్మితసబర్వాల్, మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..