AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాలు, వరదలతో అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్

రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జల వనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రహదారులు – భవనాలు తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు

వర్షాలు, వరదలతో అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్
Balaraju Goud
|

Updated on: Aug 17, 2020 | 6:44 PM

Share

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు, మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ, అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు.

రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జల వనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రహదారులు – భవనాలు తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలన్న సీఎం.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడవద్దని, అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతీ రోజు నివేదిక తెప్పించుకుని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రకృత వైపరీత్యం తలెత్తినా సరే ఎక్కడా ఏమాత్రం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్న సీఎం కేసీఆర్.. గ్రిడ్ ఫెయిల్ కాకుండా సమర్థవంతంగా వ్యవహరించిన విద్యుత్ శాఖతో పాటు వ్యవసాయ శాఖను, హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో నష్టం కలగకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి అభినందించారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వరదల ఉధృతి ఎక్కువున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సిఎం ప్రత్యేకంగా సమీక్షించారు.

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ అన్ని కారణాల వల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడి, భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. మిషన్ కాకతీయలో చేపట్టని కొన్ని చిన్న పాటి కుంటలకు మాత్రమే నష్టం వాటిల్లింది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున, చెరువులకు వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.. ప్రతీ చెరువునూ ప్రతీ నిత్యం గమనిస్తూనే ఉండాలి’’ అని సిఎం ఆదేశించారు.