AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 42 శాతం బీసీ కోటాతోనే స్థానికసంస్థల ఎన్నికలకు!… ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణకు కేబినెట్ నిర్ణయం

ఎస్‌సీ వర్గీకరణ అమలుచేసే తొలి రాష్ట్రంగా చరిత్రకెక్కిన తెలంగాణ.. అదే రీతిలో మరో ఘనతను సాధించబోతోంది. దేశంలో తొలిసారిగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసే రాష్ట్రం మాదే అని సగర్వంగా ప్రకటించుకుంటోంది తెలంగాణ. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వెనుక చాలా కసరత్తే జరిగింది. వెనుకబడినవర్గాలకు...

Telangana: 42 శాతం బీసీ కోటాతోనే స్థానికసంస్థల ఎన్నికలకు!... ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణకు కేబినెట్ నిర్ణయం
Telangana Cabinet
K Sammaiah
|

Updated on: Jul 11, 2025 | 7:14 AM

Share

ఎస్‌సీ వర్గీకరణ అమలుచేసే తొలి రాష్ట్రంగా చరిత్రకెక్కిన తెలంగాణ.. అదే రీతిలో మరో ఘనతను సాధించబోతోంది. దేశంలో తొలిసారిగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసే రాష్ట్రం మాదే అని సగర్వంగా ప్రకటించుకుంటోంది తెలంగాణ. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వెనుక చాలా కసరత్తే జరిగింది. వెనుకబడినవర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి అని భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ లేవనెత్తిన డిమాండ్.. ఎట్టకేలకు అమల్లోకి రాబోతోంది. రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు దిశగా కీలక ముందడుగు వేసింది రేవంత్ సర్కార్. బీసీ రిజర్వేష్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, ఇందుకోసం 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని గురువారం జరిగిన 19వ క్యాబినెట్‌ సమావేశం డిసైడైంది. ఈ నిర్ణయాన్ని సామాజిక విప్లవానికి నాందిగా చెప్పుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీల ఓటుబ్యాంకు ఇక తమ పక్షమే అన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే సంబరాల్లో మునిగింది. మిగతా పార్టీలు కూడా తమ వెంట నడవాలని పిలుపునిస్తోంది.

బీసీ కోటాపై నిర్ణయం ఆషామాషీగా జరిగింది కాదు. దీనివెనుక కాంగ్రెస్ పార్టీ పడ్డ ప్రసవవేదన చాలానే ఉంది. మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవలే ఆర్డర్‌ వేయడంతో యుద్ధప్రాతిపదికన ముందుకు కదిలింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైకోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లపై నెలరోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో.. వాట్‌నెక్ట్స్ అనే ఆలోచనలో పడింది. స్థానిక ఎన్నికల్ని రెఫరెండమ్‌గా స్వీకరించాలంటూ అపోజిషన్ పార్టీలు సైతం సవాళ్లు విసరడంతో తమకు పాపులర్ నినాదమైన బీసీ రిజర్వేషన్ల అంశంపై దృష్టి పెట్టింది.

రాష్ట్ర ప్రణాళిక విభాగం అధ్వర్యంలో కులగణన దిగ్విజయంగా పూర్తి చేసి, బీసీ జనాభా లెక్కల్ని పక్కాగా తేల్చి.. కోటా సైజును కూడా 42 శాతంగా ఖరారు చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినప్పటికీ… అమలు విషయం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉండిపోయింది. అందుకే.. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం మూడు మార్గాలను పరిశీలించింది టీ-సర్కార్. మొదటిది… రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం. రెండోది.. రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీచేసి రిజర్వేషన్లు అమలు చేయడం… మూడోది పార్టీపరంగా బీసీలకు 42శాతం సీట్లు కేటాయించడం. ఇందులో సెకండ్ ఆప్షన్‌కే ఓటేసింది రేవంత్ క్యాబినెట్.

స్థానికసంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గవర్నర్‌ ద్వారా ఆర్డినెన్స్‌ జారీ చేయించి, జీవోను తీసుకురావాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటేడ్ కమిషన్‌ను నియమించింది. సర్పంచ్, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. ఎంపీపీ, జెడ్‌పీటీసీలకు జిల్లాను, జడ్‌పీ ఛైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్‌గాను పరిగణిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయ్‌. బీసీలకు 42శాతం కోటా కల్పిస్తే.. మొత్తం రిజర్వేషన్లు 70శాతానికి చేరతాయి.