Telangana: మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ
మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఆయనపై ఉన్న 3 కేసుల వివరాలను కూడా ప్రకటించింది. ఈ కేసులన్నింటిని ప్రభుత్వం కక్ష పూరితంగా పెట్టిందని ఆ ప్రకటనలో బీజేపీ పేర్కొంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజగోపాల్‌రెడ్డికి మంచి పేరుందని, ఆ నియోజకవర్గ ఉపఎన్నికల్లో రాజగోపాల్ పేరు ఒక్కటే తమ పరిశీలనకు రావడంతో ఆయనను తమ అభ్యర్థిగా ప్రకటించామని ఆ ప్రకటనలో బీజేపీ పేర్కొంది. మునుగోడులో అసలు సిసలైన యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసింది మొదలు.. మునుగోడులో రాజకీయ మంటలు అంటుకున్నాయి. అవిప్పుడు మరో లెవెల్‌కు చేరుకున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ కారిడార్ అట్టుడికిపోతోంది. ఉపసమరంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనేది పోలింగ్ జరిగి, ఫలితం బయటకొస్తే కానీ తెలియదు…గెలుపుపై ఎవరి ధీమా వారిది. ఎవరి ప్రయత్నాలు వారివి. కానీ..అంతకు ముందే జరుగుతున్న పొలిటికల్ వార్ మాత్రం సెగలు రేపుతోంది.
బీజేపీ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
బీజేపీపై విమర్శల దాడి పెంచింది కాంగ్రెస్. రాజగోపాల్‌రెడ్డిని బొగ్గు గోపాల్‌గా సంబోధించారు మాణిక్కంఠాగూర్. కాంగ్రెస్ చెప్పిందే.. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి అంగీకరించారంటూ ట్వీట్ చేశారు. బొగ్గు గోపాల్ కంపెనీకి ఇచ్చిన బొగ్గు కాంట్రాక్టు విలువ 18 వేల కోట్లన్నారు. అందుకే బొగ్గు గోపాల్ BJPలో చేరాడని విమర్శించారు మాణిక్కంఠాగూర్.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు సీరియస్
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయన్న వెంటనే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి కోవర్ట్‌గా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయన మునుగోడు ప్రచారానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీకి నష్టం కలిగిస్తున్న ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. ఇటు టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ధర్మంవైపే తన సోదరుడు ఉంటారని అన్నారు. సమయం వచ్చినపుడు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి
